karimnagar | తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం

karimnagar | మొన్న బిజెపి… నిన్న కాంగ్రెస్…నేడు బీజేపీ
చేతులెత్తేసిన కాంగ్రెస్
.. రోడ్డున పడ్డ స్వతంత్ర అభ్యర్థులు
కరీంనగర్ ఆంధ్రప్రభ
కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కరీంనగర్ మేయర్ పీఠం బిజెపి ఖాతాలోకి వెళ్లనుంది. మొన్న బిజెపి.. నిన్న కాంగ్రెస్…మళ్ళీ నేడు బిజెపి వైపు మళ్ళింది. భారత రాష్ట్ర సమితి తటస్థంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. కౌంటింగ్ జరిగిన నాటి నుండి కరీంనగర్ పీఠం బిజెపి కేనని అందరూ భావించగా అనూహ్యంగా కాంగ్రెస్ మేయర్ కుర్చీని వశం చేసుకునేందుకు పావులు కదిపింది. 66 స్థానాలు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ లో 30 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను, బిఆర్ఎస్ 9 స్థానాలను, ఎంఐఎం మూడు స్థానాలను, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాలను, స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే బిజెపి కార్పొరేటర్ లను క్యాంపుకు తరలించారు. ఇది గమనించిన అధికార పార్టీ తోపాటు బిఆర్ ఎస్, ఎంఐఎంలు సైతం వారి అభ్యర్థుల ను హైదరాబాద్ క్యాంపులకు తరలించారు. కౌంటింగ్ జరిగిన రోజున రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 13వ డివిజన్ నుండి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్ నుండి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలుపొందిన విఫల సాయి జ్యోతి లు కాషాయం గూటికి చేరారు. దీంతో వారి బలం 32 కు చేరింది. శనివారం 17వ వార్డు నుండి గెలుపొందిన వేముల కవితా చంద్రశేఖర్, 39 వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన మాసం గణేష్ లు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. దీంతో బీజేపీ బలం 34 చేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఎక్స్ అఫీషియో మెంబర్షిప్ ఉండడంతో వారి బలం 35కు చేరింది. ఇంకేముంది కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి చేజిక్కించుకోవడం లాంచనమే అని భావించారు. ఇక్కడే కాంగ్రెస్ కథ మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలని పావులు కదపడం మొదలెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాల్సిందేనని ఆ బాధ్యతలు మంత్రు లకు అప్పగించారు. ఇంకేముంది కరీంనగర్ పీఠం దక్కించుకునే విధంగా చర్యలు చేపట్టారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎమ్ఐఏం స్వతంత్ర అభ్యర్థులతో కలిసి కరీంనగర్ పీఠం దక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేశారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులను హైదరాబాదులోని కాంగ్రెస్ క్యాంప్ కు తరలించారు. బిఆర్ఎస్ క్యాంపులో కరీంనగర్ 35వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా సమీనా పర్వీన్ చేరారు. దీంతో టిఆర్ఎస్ బలం 10కి చేరింది. బిజెపి క్యాంపులో 34, కాంగ్రెస్ క్యాంపులో 22 మంది సభ్యులు ఉన్నారు. పదిమంది సభ్యులు బిఆర్ఎస్ క్యాంప్ లో ఉండగా కాంగ్రెస్ మద్దతు కోరింది. బిఆర్ఎస్ సభ్యులతో కలిసి తమకు 33 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు
కాంగ్రెస్ క్యాంపుకు సాయి జ్యోతి
కరీంనగర్ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఫలితాలు వెలువడిన రోజున బిజెపిలో చేరిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి విఫల సాయి జ్యోతిని ఒప్పించి కరీంనగర్ నుండి హైదరాబాదులోని కాంగ్రెస్ క్యాంపుకు తరలించారు. సాయి జ్యోతి కాంగ్రెస్ క్యాంపులో చేరడంతో భారత రాష్ట్ర సమితి సభ్యులతో కలిసి వారి బలం 33కు చేరిందని భావించారు.
ఎక్స్ అఫీషియో సభ్యుల బలంతో కలిసి మ్యాజిక్ ఫిగర్ 35 కు చేరామని ఇక మేయర్ పీఠం మాదే అని భావించారు.
తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం
కరీంనగర్ మేయర్ పీఠం కోసం సోమవారం జరిగే ఎన్నికలో తటస్థం గా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కు మద్దతిస్తే రేపటినుండి బిజెపి తమపై దుమ్మెత్తి పోస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా అవాస పాలై పోతామని కారు పార్టీ తటస్థ నిర్ణయానికి వచ్చింది. బిఆర్ఎస్ నిర్ణయం కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లింది. స్వతంత్ర అభ్యర్థితో కలిసి బిర్ ఎస్ శిబిరంలో పదిమంది తమకు మద్దతు ఇస్తారు అనుకుంటే వారు చేతులెత్తేయడంతో కాంగ్రెస్ ఆశలు వదులుకుంది. ఇక మేయర్ పీఠం దక్కదని చేతులు ముడుచుకుంది. కాంగ్రెస్ ను నమ్ముకున్న పద్ధతి అభ్యర్థులు రోడ్డున పడినట్లు అయింది. తాజా పరిణామాలు కరీంనగర్ మేయర్ పీఠం బిజెపి ఖాతాలోకి వెళ్లేలా చేశాయి.
