AP | ఫెర్రీ ఇసుక రీచ్ పై మైనింగ్ అధికారుల ఆకస్మిక దాడులు…

  • ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్లు సీజ్
  • మరో పది ట్రాక్టర్లను పరారీ

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రీచ్ పై గనులు, భూగర్భ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు చేశారు. గత కొంతకాలంగా ఫెర్రీ ఇసుక రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 23 ట్రాక్టర్లను గుర్తించారు. వాటిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో పది ట్రాక్టర్లను డ్రైవర్లు దారి మళ్లించి పరారయ్యారు. మిగిలిన 13 ట్రాక్టర్లను సీజ్ చేశారు. కొన్ని నెలల నుంచి అధికార పార్టీకి చెందిన వారు పలు గ్రామాల్లోని కృష్ణా నదిలో ఇసుక అక్రమంగా తవ్వి ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు.

వాటాలు దక్కలేదన్న అక్కసుతో కొంతమంది స్థానిక నేతలు గనులు, భూగర్భ శాఖ అధికారులకు సమాచారం అందించారని అనుకుంటున్నారు. కాగా ఫెర్రీ ఇసుక రీచ్ లో దాడులు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులు చేసిన మైనింగ్ అధికారులతో ఇసుక అక్రమ రవాణాదారులు వాగ్వాదానికి దిగారు.

ఇది మా ప్రభుత్వం.. మేం గెలిపించుకున్నాం.. మా ఇష్టం.. మేము పుట్టక ముందు నుంచి ఇక్కడ ఇసుక రీచ్ ఉంది. అప్పటి నుంచి ఇసుక తోలుకుంటున్నాం.. మమ్మల్ని ఆపొద్దు.. ఇబ్బంది పెట్టొద్దని మైనింగ్ అధికారికి గట్టిగా చెప్పారు.

కేసులు నమోదు చేస్తాం: మైనింగ్ ఏడీ వీరాస్వామి

ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో నిబంధనలకు విరుద్ధంగా పడవలతో ఇసుక తవ్వకాలు జరిపి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశామని గనులు, భూగర్భ శాఖ ఏడీ వీరాస్వామి తెలిపారు. ఈ దాడుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 23 ట్రాక్టర్లను పట్టుకున్నామని, పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో 10 ట్రాక్టర్లను దారి మళ్లించి పరారయ్యారని, కేవలం 13 టాక్టర్లు మాత్రమే పోలీస్ స్టేషన్ కి చేరాయన్నారు.

వాటిని సీజ్ చేశామని, నదిలో నుంచి ఇసుకను తీసుకు వస్తున్న 13 పడవలు, కొన్ని జేసీబీలను సైతం గుర్తించామని వాటిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పరారైన ట్రాక్టర్ల నెంబర్లను గుర్తించామని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *