AP | కృషి, పట్టుదలకు ప్రతీక దామోదరం సంజీవయ్య

AP | కృషి, పట్టుదలకు ప్రతీక దామోదరం సంజీవయ్య

  • కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

AP | గుంటూరు, ఆంధ్రప్రభ : దామోదరం సంజీవయ్య కృషి, పట్టుదలకు ప్రతీక అని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్, సంజీవయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహానేత అని పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి, కృషి, పట్టుదలతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి సామాజిక న్యాయం కోసం పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించారని అన్నారు. భారత స్వాతంత్ర్య సమరంలో చురుకైన పాత్ర పోషించి, దేశ స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొని జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేశారని ప్రశంసించారు. ప్రజా సేవ లక్ష్యంగా జీవించారని అన్నారు. మంచి పనితనం, నిజాయితీ, ప్రజల పట్ల అంకితభావంతో ఎల్లప్పుడూ కొనసాగారని తెలిపారు. ముఖ్య మంత్రిగా పేదల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, కార్మికుల సంక్షేమం, పరిపాలనలో పారదర్శకత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేశారన్నారు.

దామోదరం సంజీవయ్య చేసిన సేవలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచాయని, ఆయన నుండి ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా యువత ఎంతో స్ఫూర్తిని పొందాలని సూచించారు. సంజీవయ్య అడుగుజాడలు యువతకు మార్గదర్శకం అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply