Waqf Board | మైనారిటీల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించొద్దు

Waqf Board | మైనారిటీల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించొద్దు
- జాయింట్ కలెక్టరేట్‌కు వైఎస్ఆర్సిపి వినతి..
Waqf Board | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు, అంజుమన్‌కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సిపి మైనారిటీ విభాగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టరేట్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎం.డి. రుహుల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షులు మస్తాన్, పార్లమెంట్ కార్యదర్శి, ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ మీర్ హుస్సేన్ పాల్గొన్నారు.
Waqf Board | మైనారిటీల ఆస్తులకు భద్రత కల్పించాలి
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను, అంజుమన్‌కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోందని ఆరోపించారు. దీనిని వైఎస్ఆర్సిపి మైనారిటీ విభాగం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ అంశంపై మైనారిటీ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు. గత ఐదేళ్లలో జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో మైనారిటీలు సంతృప్తిగా ఉన్నారని, మసీదుల అభివృద్ధి, వక్ఫ్ భూములకు రక్షణ, ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాల వంటి సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసిందన్నారు.

కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని, అడుగడుగునా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ తమ మాటలను సరిగ్గా వినలేదని, మొక్కుబడిగా వినతి పత్రం స్వీకరించారని ఆరోపించారు.ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం నిద్రపోతున్నట్లుగా ఉందని, అధికారులు పార్టీలకు అతీతంగా పని చేయాలని దేవినేని అవినాష్ సూచించారు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని, మైనారిటీల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూములను కాపాడేందుకు వైఎస్ఆర్సిపి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Waqf Board |దోపిడీ రాజ్యం నడుస్తోంది…

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎం.డి. రుహుల్లా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యంలా కొనసాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇప్పటికే 50 వేల ఎకరాలు పూలింగ్‌లో తీసుకున్నారని, ఇంకా భూములు కావాలంటే అక్కడే తీసుకోవాలి తప్ప మైనారిటీల వక్ఫ్ ఆస్తులపై కన్ను వేయడం తగదన్నారు.

మంగళగిరిలో మైనారిటీల భవిష్యత్తు కోసం ఇచ్చిన 72 ఎకరాల అంజుమన్ ఆస్తిని ఐటీ హబ్ పేరుతో తీసుకోవాలని చూడటం అన్యాయమని, అలాగే గుంటూరులో పెద్ద మసీదుకు చెందిన 270 ఎకరాల భూమిపై కూడా కన్ను వేసినట్టు ఆరోపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికీ ముస్లింలకు ఒక హజ్ హౌస్ కూడా లేదని, అలాంటి మౌలిక అవసరాలు పట్టించుకోకుండా ఆస్తులు పంచుకోవడం సరికాదన్నారు.
2029లో మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శులు రిజ్వాన్, బడేమియా, కో-ఆప్షన్ మెంబర్ అలీమ్, తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు సుభాని, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మున్నా, జిల్లా సెక్రటరీ కట్టప్ప, జిల్లా కార్యదర్శి ముస్తఫ్ఫా తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
click here to read more : Collector | ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో ఉండాలి..
