లోక్‌సభలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లును లోక్‌సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. అక్రమచొరబాటుదారులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం. భారత్‌లోకి అక్రమంగా చొరబడితే 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పాస్‌పోర్టులు, వీసాలు పొందితే చర్యలు తీసుకోవచ్చు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్నిఅధికారాలు అప్పగిస్తూ బిల్లును రూపొందించారు. తాజా బిల్లు ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సంక్రమించనున్నాయి.
భారత్‌లో ఇప్పటికీ బ్రిటీష్ కాలం నాటి ఇమ్మిగ్రేషన్ చట్టాలనే ప్రభుత్వాలు అమలు పరుస్తూ వస్తున్నాయి. వాటిలోని లోపాలు దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లుతున్నాయి. గత కొన్నాళ్లుగా దేశంలోకి అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా కేంద్రం ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025’ను సభలో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఆ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది.
ఇప్పటికే ఉన్న వలసవాద చట్టాల స్థానంలో ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు, 2025’ను తీసుకొచ్చింది ప్రభుత్వం. పాస్‌పోర్ట్ (ఎంట్రీ ఇన్‌టూ ఇండియా) యాక్ట్, 1920; రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, 1939; ఫారినర్స్ యాక్ట్, 1946; ది ఇమ్మిగ్రేషన్ (క్యారియర్స్ లయబిలిటీ) యాక్ట్, 2000 వంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. వీటిని స్వాతంత్య్రానికి ముందు అమల్లోకి తెచ్చారు. ప్రపంచ యుద్ధాలు, అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు. వీటిలోని నిబంధనలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. దీంతో చట్టపరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోపాలను సవరించి ఇప్పటికే ఉన్న చట్టాల స్థానంలో ఒక సమగ్రమైన కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది.