Foundation | ‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం

Foundation | ‘టీఏఏఎల్ఎం’ ఫౌండేషన్ శ్రమదానం
Foundation | బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో కాళ్లవేళ్ల పడి ఓట్లు అడిగే నాయకులు, గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొదిలేయడం పరిపాటిగా మారిందని బెల్లంపల్లి టేకులబస్తీ వాసులు మండిపడుతున్నారు. బస్తీలోని రహదారి అధ్వానంగా మారి, డ్రైనేజీ నీరు రోడ్డుపైనే నిలిచి నరకాన్ని తలపిస్తున్నా ఏ ఒక్క నాయకుడు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘తాల్మ్ ఫౌండేషన్’ టీఏఏఎల్ఎం సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం చేపట్టి, తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
టేకులబస్తీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుండటంతో బురదమయమైన దారిలో చిన్నపిల్లలు, వృద్ధులు నడవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతమంతా దుర్వాసనతో నిండిపోవడమే కాకుండా, పందుల సంచారం పెరిగిపోయింది. రాత్రివేళల్లో పాముల భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందనీ బస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరకప్రాయంగా మారిన దారిని బాగు చేసిన ఫౌండేషన్ సభ్యులను ఈ సందర్భంగా బస్తీ వాసులు ఘనంగా అభినందించారు.
