హైదరాబాద్ – చివరి నిమిషంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢీ ల్లీలో అందుబాటులో లేకపోవడంతో సీఎంతో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.
కాగా ,కేసీ వేణుగోపాల్ తో మాట్లాడి తిరిగి వారంతా సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వారితో పాటు హస్తినకు వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.అదే విధంగా కేబినెట్ విస్తరణతో పాటు పార్టీలో కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు
ఇది ఇలా ఉంటే , ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను అధిష్టానం ఫోన్ ద్వారానే కసరత్తు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఢిల్లీ నుంచి ఫోన్‌లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకోనుంది.
రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఎఐసిసి జనరల్ సెక్రటరీ కేసు వేణుగోపాల్ ఆ తర్వాత, అంతిమంగా అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు కేసీ వేణుగోపాల్ పంపనున్నారు. అనంతరం ఏఐసీసీ అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. కాగా సోమవారంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.