CPI 100 Years Celebration | 10 వేల మందికి అన్నదానం..

CPI 100 Years Celebration | 10 వేల మందికి అన్నదానం..

CPI 100 Years Celebration, తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు హాజరైన కార్యకర్తల కోసం తన సొంత వ్యయంతో సుమారు పది వేల మందికి పులిహార, దద్దోజనం ప్యాకెట్లను పంపించి ప్రత్యేక ఆదరణ చూపారు. పార్టీ శతాబ్ది ఉత్సవాల వంటి చారిత్రక సందర్భంలో కార్యకర్తల పట్ల ఎమ్మెల్యే చూపిన ఆతిథ్యం, సేవాభావం అభినందనీయమని సీపీఐ నాయకులు పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తూము కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్.కె. నాగుల్ మీరా, ఏఐవైఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తదితర నాయకులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం ఉద్యమాల నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే అనేక పోరాటాలు, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యల పై అవగాహన పెంచుకున్నారని తెలిపారు. ఉద్యమాల పట్ల ఉన్న కట్టుబాటు, ప్రజల పక్షాన నిలబడే ధైర్యమే ఆయనను రాజకీయంగా ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. కార్యకర్తల పట్ల చూపిన సేవాభావం, ఆతిథ్యం ప్రజా ప్రతినిధిగా ఆయనకు ఉన్న సామాజిక బాధ్యతను చాటుతుందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply