హైదరాబాద్ – మరికొద్ది సేపట్లో సిఎం రేవంత్ అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపిలతో సమావేశం ప్రజాభవన్ లో జరగనుంది. రాష్ట్రానికి చెందిన అందరు ఎంపీలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఐతే… రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా ఒక్కటిగా ఉంటే.. కేంద్రం కూడా తెలంగాణకు సాయం చేసేందుకు ముందుకు రావచ్చు.
తెలంగాణకి పెద్దగా సాయం చెయ్యట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టే.. తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తోందని అంటోంది. అందుకే.. ఇవాళ్టి ఎంపీల మీటింగ్‌లో కేంద్రం నుంచి ఏయే పథకాలకు ఎంతెంత నిధులు రావాలో, పెండింగ్ బిల్లులు ఏవి ఉన్నాయో, ప్రత్యేక గ్రాంట్లు ఏవి రావాలో, తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు ఏమున్నాయో.. ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు. తద్వారా ఎంపీలకు ఒక ఐడియా వస్తుంది. తద్వారా వారు ఢిల్లీలో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు వీలవుతుంది.ఇలాంటి సమావేశం జరిగినప్పుడు.. అన్ని పార్టీల ఎంపీలూ పాల్గొనాలి. రాష్ట్రంకోసం ఒకే తాటిపైకి రావాలి. అంతేతప్ప రాజకీయాలు చూసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి.
ఇలాంటి సమస్య వస్తే.. తమిళనాడులో అన్ని పార్టీలూ ఏకమవుతాయి. ఇప్పుడు డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలూ ఒకే మాటపై ఉన్నాయి. అలాగే.. తెలంగాణలో కూడా రాష్ట్రం కోసం పార్టీలు గట్టిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఎందుకంటే.. ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం భారీగా సాయం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు భారీగా లాభం పొందుతున్నాయి. తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా పన్నుల ఆదాయం వెళ్తుంటే.. ఆ స్థాయిలో కేంద్రం నుంచి సాయం తెలంగాణకు రావట్లేదనే వాదన ఉంది.బీజేపీ, బీఆర్ఎస్ డౌటే:ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన బీజేపీ.. ఉత్తర తెలంగాణలో జోరుగా ఉంది. అయితే ఇవాళ్టి మీటింగ్ కు దూరంగా ఉంది బిజెపి.. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ, సమావేశానికి ఆహ్వానించినుందుకు ధన్యవాదాలు తెలిపారు.. అయితే ఈ సమావేశానికి ఒక రోజు ముందు తమకు ఆహ్వానం అందండంతో అందరూ ఎంపిలలో కలసి చర్చించే అవకాశం కలుగలేదన్నారు. ఇదే నేపథ్యంలో ముందుగా అనేక కార్యక్రమాలు ఫిక్స్ కావడంతో సమావేశానికి హాజరుకావడం లేదని ప్రభుత్వానికి తెలిపారు.
అటు.. బీఆర్ఎస్‌లో కీలక నేతలకు ఆహ్వానం వెళ్లింది. అయితే ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు హాజరుకావడం లేదు.. ముందుగా అనేక కార్యక్రమాల షెడ్యూల్ ఉండటంతో తమ పార్టీ ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకావడం లేదని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
అయినా ఆ పార్టీ నేతలు వస్తారా అనేది అనుమానంగా ఉంది. లోక్‌సభలో:మార్చి 10 నుంచి లోక్‌సభలో రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా.. లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ వ్యూహానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసొస్తాయా అనేది చూడాలి. కాంగ్రెస్ వెంట నడిస్తే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది అని బీజేపీ అంటుంటే.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఆ డీల్ ఉంది అని బీఆర్ఎస్ అంటోంది. ఈ పరిస్థితుల మధ్య ఈ సమావేశం జరగబోతోంది.