Former Vice President | ఆరోగ్య సంరక్షణకు సుజనా ఫౌండేషన్ ఆదర్శం..

Former Vice President | ఆరోగ్య సంరక్షణకు సుజనా ఫౌండేషన్ ఆదర్శం..

  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
  • పశ్చిమంలో మొబైల్ మెడికల్ వాహనాలు ప్రారంభం

Former Vice President | భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ఉచిత మొబైల్ మెడికల్ వాన్‌లను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం మొబైల్ క్లినిక్‌లలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను వెంకయ్య నాయుడు పరిశీలించారు. ఒక మొబైల్ వాహనంలో వైద్యుల కన్సల్టేషన్‌తో పాటు ఫార్మసీ సౌకర్యం ఏర్పాటు చేయగా, మరో వాహనంలో రక్తపరీక్షల ల్యాబ్, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే వంటి ఆధునిక వైద్య పరీక్షల సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలు చేరనున్నాయి.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సుజనా ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శనీయం అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. కేవలం విగ్రహాలకే పరిమితం కాకుండా ప్రజలకు నేరుగా ఉపయోగపడే వైద్య వాహనాలు ఏర్పాటు చేయడం అద్భుతమైన ఆలోచన అని ప్రశంసించారు. సుజనా చౌదరి ఎమ్మెల్యే కావడం విజయవాడ పశ్చిమ ప్రజల అదృష్టం. ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎలా ఉండాలో చూస్తున్నాం.

సుజనా చౌదరి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఆదర్శవంతంగా సేవలందిస్తున్నారు. ప్రతి శాసనసభ్యుడు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అలాగే, ప్రతి డివిజన్‌కు సుజనా ఫౌండేషన్ తరపున సమన్వయకర్తను నియమించి ప్రజా సమస్యలపై శ్రద్ధ వహించడం అభినందనీయం. సుజనాను ఆదర్శంగా తీసుకుని మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు.

ఈ సందర్భంగా విజయవాడలో అవినీతి లేని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ప్రశంసించిన వెంకయ్య నాయుడు, బెజవాడలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకున్నారు అన్నారు. పార్టీలు బాగుండాలంటే ముందు నాయకులు బాగుండాలి. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో గౌరవంగా వ్యవహరించడం, బాధ్యతాయుతంగా మాట్లాడడం చాలా అవసరం. ఆయా పార్టీల నాయకత్వం కూడా తమ ప్రజాప్రతినిధులు నీతివంతంగా ప్రజలకు సేవలందించేలా దిశానిర్దేశం చేయాలి అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

Leave a Reply