Telangana | అంగరంగ వైభవంగా చలి బోనాల పండుగ..

Telangana | అంగరంగ వైభవంగా చలి బోనాల పండుగ..
Telangana, కుంటాల, ఆంధ్రప్రభ : కుంటాల మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఆదివారం రోజు మౌని అమావాస్య పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం అమావాస్య సందర్భంగా తొలి ఆదివారం గ్రామదేవతలకు చలి బోనాలను సమర్పిస్తారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి నైవేద్యం అమ్మవారికి వండి మరుసటి రోజు తెల్లవారుజామున ఆదివారం ఉదయం అమ్మ వారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో ఆనవాయితీగా ఒక్కరోజు ముందుగానే నైవేద్యం తయారు చేసిన అనంతరం నైవేద్యం మరుసటి రోజు అమ్మవారికి సమర్పించడం అనే సాంప్రదాయం పాటిస్తారు. అయితే మండల కేంద్రమైన కుంటాలలోని ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయంలో చలి బోనాల సందడి నెలకొంది. దీంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా మహారాష్ట్ర ప్రాంతాల నుండి బోనాలను సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బోనాలు సమర్పించడం మాత్రమే కాదు ఏదైనా శుభకార్యాలు చేస్తారు. తొలిసారిగా పంట చేతికి వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనాల సమర్పిస్తుంటారు. అనంతరం ఏదైనా శుభకార్యాలతో పాటు గృహప్రవేశాలు, పండుగలు తదితర వాటిని ఆనవాయితీగా చేస్తుంటారు. దీంతో ఆలయాలు ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడాయి. ఆయురారోగ్యాలతో.. సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకొంటారు. పంటలు సమృద్ధిగా పండాలని.. పిల్లాపాపల సుఖసంతోషాలతో ఉండాలని.. గ్రామ దేవతలను వేడుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో బోనాలను సమర్పించారు.
