Nandi Children’s Festival | సృజనాత్మకతను వెలికి తీసేందుకే పిల్లల పండుగ..

Nandi Children’s Festival | సృజనాత్మకతను వెలికి తీసేందుకే పిల్లల పండుగ..
- ఘనంగా నంది బాలోత్సవాలు ఏర్పాటు..
Nandi Children’s Festival | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : చిన్నారి పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, వారిలో నైపుణ్యాన్ని కనిపెట్టేందుకు, వారిలో పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు నంది బాలోత్సవం సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఈ రోజు తెలిపారు. ఫిబ్రవరి 17,18 తేదీలలో జరుగు నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దామని బాలోత్సవాల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డా. క్రాంతి చైతన్య, ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డా. శ్రీకాంత్ లు పిలుపునిచ్చారు.
ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. గురుస్వామి, నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్ డి. మౌలాలి, ఆహ్వాన సంఘం సలహాదారులు బి. శంకరయ్య, రామరాజు తదితరులతో కలిసి వారు మాట్లాడురు. ఈ బాలోత్సవాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనేలా యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు, వారిలో సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
ఈ బాలోత్సవాలలో సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ ఇలా మూడు విభాగాలుంటాయన్నారు. సీనియర్ విభాగంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు, జూనియర్ విభాగంలో 5,నుంచి 6, 7 తరగతుల విద్యార్థులకు, సబ్ జూనియర్ విభాగంలో 2,నుంచి 3, 4 తరగతుల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కల్చరల్ విభాగంలో 17 వ తేదిన శాస్త్రీయ నృత్యం, ఏక పాత్రాభినయం, ఫాన్సీ డ్రస్ లఘు నాటిక, అకాడమిక్ విభాగంలో సైన్స్ ఎగ్జిబిషన్, చిత్రలేఖనం, కార్టూన్, వ్యాసరచన తెలుగు, వ్యాసరచన ఇంగ్లీషు, కథా రచన తెలుగు, కవిత రచన ఉత్తరం రాయడం ఉంటాయన్నా రు.
18 వ తారీఖున కల్చరల్ విభాగంలో జానపద నృత్యం, దేశభక్తి అభ్యుదయ గీతాలాపన, కోలాటం వంటివి ఉంటాయన్నారు. అకాడమిక్ విభాగంలో సెల్ప్ బి ఇంగ్లీష్, మ్యాప్, ఉపన్యాసం తెలుగు, ఇంగ్లీషులలోనూ, క్విజ్, తెలుగులో మాట్లాడటం మెమరీ టెస్ట్ పద్యం భావం, మట్టితో బొమ్మలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. బాలోత్సవాల ప్రారంభోత్సవానికి స్థానిక జిల్లాకు చెందిన మంత్రులను, జిల్లా కలెక్టర్ ఎస్పీ, జాయింట్ కలెక్టర్ హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
