23rd jan Vasantha Panchami | వాగ్దేవి ఉపాసనలో అంతరార్థం – వైదిక విశ్లేషణ

23rd jan Vasantha Panchami | వసంత పంచమి ప్రాముఖ్యత:
ఋతువులలో వసంతుడిగా జ్ఞాన స్వరూపం
యాజ్ఞవల్క్య స్మృతిలో విద్య–ధర్మాల అనుసంధానం
సౌందర్యలహరిలో సరస్వతీ దేవి స్వరూప విశ్లేషణ
అక్షరాభ్యాసం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన
జ్యోతిష శాస్త్ర దృష్టిలో వసంత పంచమి విశిష్టత
వసంత పంచమి పూజా విధానం మరియు కర్తవ్యాలు
భారతీయ సంస్కృతిలో జ్ఞానానికి ఉన్న శాశ్వత విలువ

23rd jan Vasantha Panchami | మాఘ శుద్ధ పంచమి” తిథిని మనం ‘శ్రీ పంచమి’గా, ‘వసంత పంచమి’గా, ‘సరస్వతీ జయంతి’గా జరుపుకుంటాం. చలికాలం ముగిసి, ప్రకృతి పచ్చని చిగురులతో నూతన శోభను సంతరించుకునే ‘వసంత ఋతువు’ ప్రారంభం ఈ రోజే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ “ఋతూనాం కుసుమాకరః” (ఋతువులలో నేను వసంతుడను) అని చెప్పాడు. ప్రకృతిలో వసంతం ఎంత అందంగా ఉంటుందో, మనిషి జీవితంలో ‘జ్ఞానం’ అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీ దేవి ఆవిర్భవించిన పవిత్ర దినం ఇది యాజ్ఞవల్క్య స్మృతి – ధర్మం మరియు విద్య: సాధారణంగా చదువు అంటే కేవలం ఉద్యోగం కోసమే అని నేటి సమాజం భావిస్తోంది.

23rd jan Vasantha Panchami
23rd jan Vasantha Panchami

కానీ, సనాతన ధర్మంలో విద్య యొక్క పరమార్థం వేరు. ధర్మశాస్త్ర కర్త అయిన యాజ్ఞవల్క్య మహర్షి తన ‘యాజ్ఞవల్క్య స్మృతి’ లో విద్యను ధర్మానికి ఎలా ముడిపెట్టారో చూడండి:

శ్లో|| పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాంగ మిశ్రితాః |

వేదాః స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ ||

(యాజ్ఞవల్క్య స్మృతి – ఆచారాధ్యాయం)

భావం: పురాణాలు, న్యాయ శాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రం, ఆరు వేదాంగాలు, మరియు నాలుగు వేదాలు – ఈ పద్నాలుగు విద్యాస్థానాలు. ఇవి కేవలం విద్యలనే కాదు, ధర్మాన్ని కూడా బోధిస్తాయి. అంటే, “ధర్మాన్ని రక్షించేదే నిజమైన విద్య” అని యాజ్ఞవల్క్యుల వారి ఉద్దేశం.

ఈ వసంత పంచమి నాడు మనం కోరుకోవాల్సింది అక్షర జ్ఞానంతో పాటు, ధర్మ జ్ఞానాన్ని కూడా! అమ్మవారి స్వరూపం – సౌందర్యలహరి విశ్లేషణ: జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ఉపాసించే విధానాన్ని ‘సౌందర్యలహరి’ లో అద్భుతంగా వివరించారు. సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా మహా కవిగా మారుతాడని శంకరులు చెప్పిన తీరు అనిర్వచనీయం.

వసంత పంచమి నాడు అమ్మవారిని ఎలా ధ్యానించాలి? శంకరులు సౌందర్యలహరిలో ఇలా సెలవిచ్చారు: శ్లో|| శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరామ్ | సకృన్న త్వా నత్వా కథమిహ సతాం సన్నిదధతే మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః || (సౌందర్యలహరి – 15వ శ్లోకం)

భావం: “ఓ తల్లీ! శరత్కాలపు వెన్నెల వలె స్వచ్ఛమైనదానా! చంద్రవంకను సిగలో ధరించినదానా! అభయ ముద్రను, వరాలను, స్ఫటిక మాలను, పుస్తకాన్ని చేతిలో ధరించినదానా! నిన్ను ఒక్కసారి నమస్కరించిన భక్తుల వాక్కుల నుండి… తేనె, పాలు, ద్రాక్షల కంటే తీయని కవిత్వం, పాండిత్యం ప్రవహిస్తుంది.” ఎంత అద్భుతమైన వర్ణన! మనం పుస్తకాన్ని చేతిలో పట్టుకుంటాం, కానీ అమ్మవారు జ్ఞానాన్నే స్వరూపంగా ధరించింది. అందుకే ఈ రోజు చిన్నపిల్లలకు ‘అక్షరాభ్యాసం’ చేయించడం వెనుక ఉన్న ఉద్దేశం..

వారి నాలుకపై అమ్మవారు నాట్యం చేయాలనే కోరిక. జ్యోతిష శాస్త్ర రీత్యా వసంత పంచమి ప్రాముఖ్యత: ఒక జ్యోతిష పరిశోధకుడిగా (Researcher) చెప్పాలంటే.. మన జాతకంలో బుధుడు (Mercury) లౌకిక విద్యకు కారకుడైతే, గురుడు (Jupiter) పారమార్థిక జ్ఞానానికి కారకుడు. వసంత పంచమి నాడు, రవి (Sun) మకర రాశిలో ఉంటూ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రకాశిస్తుంటాడు.

ఈ రోజున చేసే సరస్వతీ పూజ వల్ల జాతకంలో ఉన్న ‘బుధ దోషాలు’ తొలగిపోతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పూజా విధానం – కర్తవ్యం: ఈ రోజున విద్యార్థులు, కవులు, రచయితలు తమ పుస్తకాలను, పెన్నులను అమ్మవారి పటము ముందు ఉంచి పూజించాలి. తెల్లని పూలు (మల్లెలు) అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రం. “యా కుందేందు తుషార హార ధవళా…” అంటూ అమ్మవారిని స్తుతించి, పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం శ్రేయస్కరం.

వసంత పంచమి కేవలం ఒక పండుగ కాదు, అది మన భారతీయ సంస్కృతిలో “జ్ఞానానికి” ఉన్న విలువను గుర్తుచేసే రోజు. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి, విజ్ఞానమనే వెలుగును నింపే ఆ వాగ్దేవి కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ…

జల్లవరపు సాయి ధీరజ్ శర్మ

స్మార్త పురోహితులు, జ్యోతిషులు

click here for more

click here to read 6Things | భగవంతుడు ఉంటే ఎందుకు కనపడట్లేదు?

Leave a Reply