Dhammapet | ప్రైవేట్ బస్సు బోల్తా..

Dhammapet | ప్రైవేట్ బస్సు బోల్తా..
- తృటిలో తప్పిన పెను ప్రమాదం
- పలువురికి గాయాలు
Dhammapet | దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గట్టుగూడెం సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తాపడిన సంఘటన మంగళవారం తెల్లవారుఝామున జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం… రాజమండ్రి నుండి 48మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తున్నకేవీఆర్ టూర్స్ ట్రావెల్స్ బస్సు దమ్మపేట మండలం గట్టుగూడెం సమీపంలో బ్రేక్ ఫెయిల్ అయ్యి, బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. తెల్లవారు ఝామున కావడంతో ప్రయాణీకులు గాఢ నిద్రలో వున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
చీకట్లో హాహాకారాలు చేస్తుండటంతో ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు, సమాచారం తెలుసుకున్న దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, సిబ్బంది బస్సు కిటికీలు పగులగొట్టి ప్రయాణీకులను బయటకు తీసి, 108 కాల్ సెంటర్ కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే మూడు జిల్లాల( ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్ ) ప్రోగ్రాం మేనేజర్ షేక్. నజీరుద్దీన్ చుట్టుపక్కల ఉన్న అన్ని అంబులెన్సులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది బయలుదేరి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన క్షతగాత్రులను దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజరుద్దీన్ దమ్మపేట 108 అంబులెన్స్ ను, అశ్వరావుపేట 108 అంబులెన్స్ ను, 108 సత్తుపల్లి అంబులెన్స్ ను, ములకలపల్లి 108 అంబులెన్స్ ను కల్లూరు 108 అంబులెన్స్ ను అప్రమత్తం చేశారు. అన్ని108 అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. 13 మంది క్షతగాత్రులను దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్తుపల్లి 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) గొల్లమందల కృష్ణ, పైలెట్ షేక్ అన్వర్, దమ్మపేట 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్( ఈఎంటీ ) చీమల రాము, పైలట్ లాల్ సింగ్, అశ్వారావుపేట 108 సిబ్బంది ఈఎంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గడ్డం. దీప్తి పైలట్ ముక్తి నాగేంద్ర విధులు నిర్వహించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారు ధూళిపాళ సోమయాజులు, ధూళిపాళ కనకలక్ష్మీ కుమారి ,ధూళిపాళ తేజశ్రీ ,ధూళిపాళ వేదశ్రీ ,కందుల భాను ,కందుల నిత్య రోషిణి ,కాళ్ళ శ్యాం ప్రసాద్ ( చాగల్లు బస్సు డ్రైవర్ ),కాసాని శ్రీను బస్సు క్లీనర్ ,హెల్పర్ ),మట్టా శ్రీనివాసరావు ,మట్టా సుజాత , మట్టా జయదీప్ ,నాగులపల్లి ప్రశాంత్ కుమార్ ,దుగ్గిరాల గన్నమ్మ గాయపడ్డారు .సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని, ఖమ్మం జిల్లా 108 సర్వీస్ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్ , దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి , సిబ్బందిని , మూడు జిల్లాలను 24 గంటలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ ను పలువురు అభినందించారు.
