Telangana | ప్రయాణం జరభద్రం..

Telangana | ప్రయాణం జరభద్రం..

Telangana, రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : కొన్ని రోజులుగా చలి తీవ్రతతో పాటు పొగ మంచు విపరీతంగా పెరుగుతుంది. నెల రోజుల నుంచి దట్టంగా పొగమంచు కురుస్తుంది. వేకువ జామున సమయంలో ప్రయాణాలు సాగించే వాహనదారులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం సమయంలో కురుస్తున్న పొగమంచు వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులను పూర్తిగా కమ్మేస్తుంది. ఉదయం 8 గంటలు దాటిన మంచు తగ్గడం లేదు. దీంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఉదయం సమయంలో వివిధ పనుల నిమిత్తం వెళ్లే ఉద్యోగులు, వ్యాపారాలు నిర్వహించే వర్తక, వాణిజ్యదారులు ప్రయాణాలు సాగించక తప్పడం లేదు. ఈ క్రమంలోనే రోడ్డు పై వెళ్తుంటే.. దగ్గరకు వచ్చేంత వరకు వాహనాలు కన్పించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో తమ వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. పలు జాగ్రత్తలతో సురక్షిత ప్రయాణాలు చేయాలని రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

పోలీసుల సూచనలు..
1) ప్రజలు పొగమంచులో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అత్యవసరమైతే తప్పా.. ప్రయాణాలు చేయకూడదు.
2) పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రహదారుల పై ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించని పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి.
3) పరిమిత వేగంతో ప్రయాణిస్తే.. ప్రమాదాలు జరగకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది.
4) అధిక వేగంతో ప్రయాణిస్తూ సడన్ బ్రేక్ వేయడంతో వాహనాలు బోల్తా పడడం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
5) పరిమిత వేగంలో వెళితే.. ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది.
6) వాహనాలు నడిపేటప్పుడు హెడ్ లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా ఆన్లో ఉంచాలి.

Leave a Reply