MLA | గ్రామ అభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యం

MLA | గ్రామ అభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యం
- ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
MLA | నరసరావుపేట, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ పథకాలతోనే సాధ్యమయ్యేది కాదని, ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారం కూడా అంతే ముఖ్యమని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్పష్టం చేశారు. గ్రామాల పరిశుభ్రత, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామస్తుల చొరవ ఉంటేనే శాశ్వత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. నరసరావుపేట మండలం కేసానిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో దాతల సహకారంతో శనివారం సుమారు రూ.9 లక్షల విలువైన చెత్త సేకరణ వాహనాన్ని గ్రామపంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్త సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలంటే ప్రతి ఇంటి నుంచే చెత్త సేకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కొత్త వాహనం ద్వారా రోజువారీగా చెత్తను సేకరించి సక్రమంగా పారవేయడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని తెలిపారు. పరిశుభ్రత పెరిగితే అంటువ్యాధులు తగ్గి, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలకు తోడు గ్రామస్తులు ముందుకొచ్చి దాతల రూపంలో సహకారం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. కేసానుపల్లి గ్రామ ప్రజలు చూపుతున్న సామాజిక బాధ్యత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలే ముందుకొస్తే, ప్రభుత్వ సహకారం మరింత వేగంగా ఫలితాలు ఇస్తుందని చెప్పారు. నరసరావుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.
పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని వివరించారు. ప్రతి కుటుంబం చెత్తను వీధుల్లో పడేయకుండా వేరు వేరుగా సేకరించి వాహనానికి అందజేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, గ్రామాన్ని హరితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. విస్తృతంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గట్టుపల్లి సత్యనారాయణ, మన్నాన్ షరీఫ్, అమర్, గద్దె నాగేశ్వరావు, మచ్చు వీరయ్య, మందాడి ప్రభుదాస్, సైకం రామాంజనేయరెడ్డి,పోలూరి వెంకట్, పొత్తూరి శివ ప్రసాద్, మాతంగి బంగారం, షేక్ మీరావలి, మావిడి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
