Bellampally | తెరపైకి బెల్లంపల్లి జిల్లా!

Bellampally | తెరపైకి బెల్లంపల్లి జిల్లా!

  • జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కీలక కేంద్రంగా అవతరించే అవకాశాలు
  • ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు మిడిల్ పాయింట్‌గా బెల్లంపల్లి
  • మంచిర్యాల–ఆసిఫాబాద్ జిల్లాల పునర్విభజనపై ఊపందుకున్న చర్చ

Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఉత్తర తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ మొద‌లైంది. ఈ నేపథ్యంలో గతంలోనే తీవ్రంగా వినిపించిన బెల్లంపల్లి జిల్లా ఏర్పాటు డిమాండ్ మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల మధ్యలో ఉన్న బెల్లంపల్లిని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఈసారి పరిపాలనా వర్గాల్లోనూ మద్దతు పెరుగుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభజన సమయంలో బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ రాజకీయ కారణాలతో అప్పట్లో పక్కన పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని, పరిపాలనా సౌలభ్యమే ప్రధాన ప్రమాణంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆ దృష్ట్యా చూస్తే బెల్లంపల్లి అన్ని విధాలా అర్హత కలిగిన కేంద్రంగా ముందుకు వస్తోంది.

ఐదు నియోజకవర్గాలకు కేంద్రబిందువుగా బెల్లంపల్లి
చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిర్పూర్ (యూ) వంటి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి భౌగోళికంగా మిడిల్ పాయింట్‌లో ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల ప్రజలు జిల్లా కార్యాలయాల కోసం మంచిర్యాల లేదా ఆసిఫాబాద్‌కు వెళ్లాలంటే 70 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల సమయం, ధనం రెండూ వృథా అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బెల్లంపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడితే ఈ ఐదు నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టులు, వివిధ శాఖల కార్యాలయాలు ఒకే కేంద్రంలో ఏర్పడితే ఫైళ్ల కదలిక వేగవంతమవుతుందని, ప్రజల పనులు వేగంగా పూర్తవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శాంతిభద్రతల పరంగా కీలక ఆధిక్యం
జిల్లా ఏర్పాటు విషయంలో శాంతిభద్రతల మౌలిక సదుపాయాలు కీలకమైన అంశం. ఈ విషయంలో బెల్లంపల్లి ఇప్పటికే ముందంజలో ఉంది. ప్రస్తుతం బెల్లంపల్లిలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అందుబాటులో ఉండటంతో కొత్తగా జిల్లా ఏర్పాటు చేసినా భద్రతా వ్యవస్థను వెంటనే అమలు చేయడానికి అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా ఎస్పీ కార్యాలయం నిర్మించాల్సిన అవసరం లేకుండా, ఉన్న వసతులనే విస్తరించుకునే అవకాశం ఉండటంతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడంలో కీలక అంశంగా మారుతోంది.

170 పీపీ పరిధిలో విస్తారమైన ప్రభుత్వ భూములు
బెల్లంపల్లి పట్టణ పరిసరాల్లో 170 పీపీ పరిధిలో విస్తారమైన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కలెక్టరేట్, జిల్లా కోర్టు, ఎస్పీ కార్యాలయం, వైద్య కళాశాల, ఇతర శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భూసేకరణ సమస్యలు లేకపోవడం ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇప్పటికే బెల్లంపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి 363, రాష్ట్ర రహదారులు, లింక్ రోడ్ల ద్వారా అన్ని దిశలతో బెల్లంపల్లికి అనుసంధానం ఉంది. రైల్వే ప్రధాన మార్గంలో మూడు ప్లాట్‌ఫాంలతో కూడిన రైల్వే స్టేషన్ ఉండటం వల్ల రవాణా పరంగా కూడా బెల్లంపల్లి కీలక కేంద్రంగా మారింది.

విస్తరించిన మంచిర్యాల – ఆసిఫాబాద్ జిల్లాలు
ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 15 మండలాలతో విస్తరించి ఉంది. ఆసిఫాబాద్ నుంచి కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం, చింతలమానెపల్లి వంటి మండలాలకు చేరుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఒక వేళ ఆసీఫాబాద్ ను మంచిర్యాలలో వీలినం చేస్తే మారుముళ్ళ గ్రామాలకు దూర భారం అవుతోంది. ఈ రెండు జిల్లాలను యథాతథంగా కొనసాగించడం కంటే పరిపాలనా సమతుల్యత కోసం పునర్వ్యవస్థీకరణ అవసరమని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను పునర్విభజించి ఐదు నియోజకవర్గాలకు మిడిల్ పాయింట్‌లో ఉన్న బెల్లంపల్లిని కొత్త జిల్లా కేంద్రంగా చేస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు.

జిల్లా హోదాతో బెల్లంపల్లికి కొత్త రూపు
సింగరేణి బొగ్గు గనుల ప్రభావంతో ఇప్పటికే పారిశ్రామిక పట్టణంగా ఎదిగిన బెల్లంపల్లి, జిల్లా కేంద్రంగా మారితే అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. జిల్లా హోదాతో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడమే కాకుండా, రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రజలకు పరిపాలన మరింత చేరువ అవుతుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

ఒకే నియోజకవర్గంలోనే ఆరు మండలాలకు సులభ అనుసంధానం
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాలే బెల్లంపల్లి కేంద్రస్థానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. బెల్లంపల్లి మండలం నుంచి కాసిపేట, తాండూర్, భీమిని, నెన్నెల, వేమనపల్లి మండలాలకు తక్కువ దూరంలోనే రాకపోకలు సాగుతున్నాయి. వేమనపల్లి మండలం బెల్లంపల్లి నుంచి సుమారు 45 కిలోమీటర్లు ఉండగా, భీమిని, నెన్నెల వంటి మండలాలు 15 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. తాండూర్, కాసిపేట మండలాలు కూడా జిల్లా కేంద్రానికి అనువైన దూరంలోనే ఉండటం వల్ల బెల్లంపల్లి నియోజకవర్గం మొత్తం ఒకే పరిపాలనా యూనిట్‌లా పనిచేసే స్థితిలో ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆసిఫాబాద్ నియోజకవర్గానికి కూడా బెల్లంపల్లే దగ్గర
కుమురంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు బెల్లంపల్లి నుంచి ఉన్న దూరాలు మరో కీలక అంశంగా మారాయి. ఆసిఫాబాద్ మండలం బెల్లంపల్లి నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉండగా, తిర్యాని మండలం 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. రెబ్బెన మండలం కూడా కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. వాంకిడి, కెరమెరి మండలాలు ప్రస్తుతం జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నప్పటికీ, బెల్లంపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడితే ఈ మండలాలకు ప్రయాణ భారం గణనీయంగా తగ్గుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సి రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెన్నూర్ నియోజకవర్గానికి బెల్లంపల్లి అనుసంధానం
చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల పరంగా కూడా బెల్లంపల్లి కేంద్రస్థానం స్పష్టంగా కనిపిస్తోంది. మందమర్రి మండలం బెల్లంపల్లి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండగా, జైపూర్ మండలం సుమారు 40 కిలోమీటర్లు మాత్రమే. చెన్నూర్ మండలం 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం, కోటపల్లి మండలం సుమారు 75 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల బెల్లంపల్లి జిల్లా కేంద్రంగా ఉంటే ఈ ప్రాంతాల ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని భావిస్తున్నారు. సింగరేణి ప్రభావ ప్రాంతాలైన మందమర్రి, జైపూర్ వంటి పారిశ్రామిక మండలాలకు జిల్లా కార్యాలయాలు దగ్గరగా ఉంటే పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు, సమస్యల పరిష్కారం వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సిర్పూర్ నియోజకవర్గానికీ బెల్లంపల్లే సమీప కేంద్రం
సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, దాహేగాం, సిర్పూర్, కౌటాల, బెజ్జూర్ మండలాలు ప్రస్తుతం జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. కాగజ్‌నగర్ మండలం బెల్లంపల్లి నుంచి సుమారు 42 కిలోమీటర్లు, దాహేగాం 38 కిలోమీటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. సిర్పూర్, కౌటాల, బెజ్జూర్ మండలాలు 60 నుంచి 85 కిలోమీటర్ల పరిధిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రాలతో పోలిస్తే బెల్లంపల్లి చేరుకోవడం సులభమని ప్రజలు చెబుతున్నారు.అటవీ ప్రాంతాల ప్రజలకు రోడ్డు మార్గాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో, బెల్లంపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడితే వైద్య, రెవెన్యూ, పోలీస్ సేవలు వేగంగా అందుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మంచిర్యాల నియోజకవర్గానికి బెల్లంపల్లి అనివార్యం
మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల మండలం బెల్లంపల్లి నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా, నస్పూర్ 27 కిలోమీటర్లు మాత్రమే. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాలు 48 నుంచి 85 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఈ దూరాలన్నీ బెల్లంపల్లి జిల్లా కేంద్రంగా ఉంటే పరిపాలనకు అనువైన పరిధిలోనే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మధ్య బెల్లంపల్లి సహజంగా సమతుల్య కేంద్రంగా ఉండటమే ఈ డిమాండ్‌కు ప్రధాన బలం.

దూరాలే చెబుతున్న నిజం – బెల్లంపల్లి అవసరం
మొత్తంగా చూస్తే బెల్లంపల్లి నుంచి ఐదు నియోజకవర్గాల మండలాలకు ఉన్న దూరాలే ఈ పట్టణం జిల్లా కేంద్రంగా ఎంత అనుకూలమో చెబుతున్నాయి. ఇది కేవలం రాజకీయ డిమాండ్ కాదు, భౌగోళికం, రవాణా, పరిపాలన, భద్రత, అభివృద్ధి అన్నింటినీ సమతుల్యం చేసే ప్రతిపాదనగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిషన్ ముందు ఈ వివరాలు ఉంచితే బెల్లంపల్లి జిల్లా డిమాండ్‌కు బలమైన ఆధారం అవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఐదు నియోజకవర్గాలకు మిడిల్ పాయింట్‌లో ఉన్న బెల్లంపల్లి జిల్లా హోదా పొందితే ఉత్తర తెలంగాణ పరిపాలనా చిత్రపటం పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కమిషన్ ముందు బెల్లంపల్లి డిమాండ్‌కు అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ముందు బెల్లంపల్లి జిల్లా డిమాండ్‌ను బలంగా ఉంచితే సానుకూల ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఇది భావోద్వేగ డిమాండ్ కాదు, పూర్తిగా పరిపాలనా అవసరాల ఆధారంగా ఉద్భవించిన డిమాండ్ అని స్థానిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే ఉత్తర తెలంగాణ పరిపాలనా భవిష్యత్తును నిర్ధారించనుంది. ఐదు నియోజకవర్గాలకు మిడిల్ పాయింట్‌గా, అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్న బెల్లంపల్లికి జిల్లా హోదా దక్కుతుందా? లేక మళ్లీ రాజకీయ సమీకరణాల్లో ఈ డిమాండ్ మసకబారుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply