99 ఎకరాల పంట నీటి పాలు

ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) : మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు వరి పంట ఒరిగిపోయింది. చాలాచోట్ల నీటి పాలైంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఐదు గ్రామాల్లోని వరిపై మొంథా తుఫాను ప్రభావం చూపించింది.
ఈ ఖరీఫ్ సీజన్ లో ఇక్కడ సుమారు 4160 ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. 99 ఎకరాల్లో వరి, 39 ఎకరాల్లో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వరి పాలు పోసుకునే దశలో ఉంది. జూపూడి, కిలేశపురం, మూలపాడు, కొటికలపూడి, గుంటుపల్లి, ఈలప్రోలు గ్రామాల్లో ఈదురు గాలులకు వరి పంట నేల వాలింది.
పల్లపు ప్రాంతాల్లో వర్షం, వరద నీరు నిలిచిపోయి పంట నీటిలో నానుతుంది. 39 ఎకరాల్లో పత్తి తడిసిపోయి పనికిరాకుండా పోయింది. నేల వాలిన వరి పనలను నిలబెట్టాలంటే అధిక ఖర్చవుతున్నందున అలాగే వదిలేస్తామని రైతులు చెబుతున్నారు. వరి పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగిస్తే ధాన్యం రంగు మారకుండా ఉంటుందని అంటున్నారు.
నేలవాలి నీటిలో నానుతున్న వరి పనికిరాదని చెబుతున్నారు. తుఫాను ధాటికి మండల పరిధిలో సుమారు 130 మంది రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న వరి పొలాలను వ్యవసాయ శాఖ అధికారి రజిని పరిశీలించి రైతులకు తగు సూచనలు చేస్తున్నారు. నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.

