త్రాగునీటి హక్కులను కాపాడండి..

త్రాగునీటి హక్కులను కాపాడండి..
నీటిని విడుదల చేసి రబి పంటలను రక్షించండి..
జిల్లా కలెక్టర్ కి వినతి…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమకు తలమానికమైన సాగు తాగునీరు కు నిలయమైన శ్రీశైలం ప్రాజెక్టు జల నిర్వహణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతాంగాన్ని రక్షించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. సమితి ఉపాధ్యక్షుడు యర్రం శంకర రెడ్డి, కార్యవర్గ సభ్యులు నిట్టూరు సుధాకర్ రావుతో కలిసి రాయలసీమ హక్కులకు సంబంధించిన పలు జీ.ఓలు, కీలక అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
కేసీ కెనాల్‌కు సంబంధించి అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలు, రాష్ట్ర విభజన చట్టంలోని విధానాలను వివరిస్తూ వాటిని పరిగణలోకి తీసుకుని నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. సాగునీటి సలహా మండలి సమావేశానికి ముందుగానే రైతులు విస్తృతంగా రబి పంటలు సాగు చేసిన నేపథ్యంలో, కేసీ కెనాల్ ఆయకట్టుకు ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కుందూ నది పరివాహక ప్రాంతంలో నంద్యాల వరకు త్రాగునీటి అవసరాల కోసం అలగనూరు కాలువ ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు.
ఈ ఏడాది శ్రీశైలం రిజర్వాయర్‌కు సమృద్ధిగా నీటి ప్రవాహం వచ్చిన నేపథ్యంలో, ప్రాజెక్టు నిబంధనల ప్రకారం 854 అడుగుల కనీస నీటి మట్టం కంటే దిగువకు నీటిని విడుదల చేయకుండా, విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేసి నీటిని నిల్వ ఉంచాలని కోరారు. రాబోయే సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నందున ముందస్తు జాగ్రత్తగా నీటిని సంరక్షించడం అత్యవసరమని తెలిపారు.
త్రాగునీరు, సాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాయలసీమ ప్రాంత నీటి హక్కులను కాపాడుతూ భవిష్యత్తులో నీటి సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, కేసీ కెనాల్‌కు మరో తడవ నీటి విడుదల చేపడతామని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు.
