41వ డివిజన్‌లో హస్తానికి అపూర్వ మద్దతు…

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని 41వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న లక్ష్మణ్ యాదవ్ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు, స్థానిక కాలనీవాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పాటు కౌన్సిలర్‌గా కొనసాగిన లక్ష్మణ్ యాదవ్ కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రజలందరికీ సమానంగా అందించిన సేవలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చాంశంగా మారాయని వారు పేర్కొంటున్నారు. అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పేదల సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయని అంటున్నారు.గతంలో డివిజన్ ఎదుర్కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్న లక్ష్మణ్ యాదవ్ పనితీరే ఈసారి ఆయన సతీమణి స్వప్న లక్ష్మణ్ యాదవ్‌కు బలమైన అండగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మరోసారి కాంగ్రెస్ పార్టీకి, హస్తం గుర్తుకు అవకాశం ఇస్తే డివిజన్‌లో మిగిలిన సమస్యలను వంద శాతం పూర్తిచేస్తారనే నమ్మకం తమకుందని కాలనీవాసులు స్పష్టం చేస్తున్నారు. ప్రచారంలో స్వప్న లక్ష్మణ్ యాదవ్ నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను వినడం, అభివృద్ధిపై స్పష్టమైన హామీలు ఇవ్వడం సానుకూల స్పందనకు కారణమవుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మాటలకంటే పనితీరే ప్రమాణమని చెబుతూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుండటం ఆమె ప్రచారానికి అదనపు బలంగా మారింది.మొత్తంగా 41వ డివిజన్‌లో ఈ ఎన్నికలు అభివృద్ధి వర్సెస్ నిర్లక్ష్యం అనే దిశగా మారాయని, ఈ నేపథ్యంలో హస్తం గుర్తుపై ఓటు వేసి స్వప్న లక్ష్మణ్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి మరోసారి పునాది వేయాలనే సంకల్పంతో డివిజన్ ప్రజలు ముందుకు వస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
