గోదావరిఖని : “శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి” ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. ఈ రోజు 7 లక్షల 72 వేల 924 క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు (Ellampalli Project) నుండి 40 గేట్లను ఎత్తి దిగువకు 7 లక్షల 16 వేల 702 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంట గంటకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరుగుతుంది.
నేటి రాత్రికి ఎనిమిది లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లోకి అవకాశం..
ఎల్లంపల్లి (Ellampalli) నుంచి గురువారం రాత్రి వరకు సుమారుగా 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే పరిస్థితులు ఉన్నట్లు ప్రాజెక్టు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) కు సంబంధించిన గేట్లు ఎత్తేశారు. ఈ ప్రాజెక్టు నుండి 3 లక్షల 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
దీనికి తోడు కడెం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను కూడా ఎత్తివేసి 46296 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ కు భారీగా వరద తాకిడి ఏర్పడుతుంది. దీంతో గోదావరి నది (Godavari River) కి ఇరువైపులా వరద ప్రవాహం పెరిగింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని గురువారం రోజున ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.