2ndAprilchintana | మానవత్వం, ఆధ్యాత్మికత పై సమగ్ర విశ్లేషణ..

2ndAprilchintana | మానవత్వం, ఆధ్యాత్మికత పై సమగ్ర విశ్లేషణ..

2ndAprilchintana | మానవత్వం అవసరమైన నేటి ప్రపంచ పరిస్థితులు
స్వార్థం vs మానవ ప్రవృత్తి
మానవ సేవయే మాధవ సేవ భావన
ఆధ్యాత్మికతలో కరుణ, సహానుభూతి ప్రాధాన్యం
అహంకారం మానవత్వానికి అడ్డంకి
ఏకత్వ దర్శనం మరియు సమాజ శాంతి
మతం కన్నా మానవత్వం మిన్న అనే సందేశం

2ndAprilchintana | యుద్ధాల నీడలో ప్రపంచం కొట్టు మిట్టాడుతున్న నేటి కాలంలో ‘మానవత్వం’ అనేది కేవలం ఒక పదంలా కాకుండా, ఒక అత్యవసర అవసరంగా కనిపిస్తోంది. సాంకేతికత పెరిగి లోకం గ్లోబల్ విలేజ్ మారినా, మనుషుల మధ్య దూరం, ద్వేషం తగ్గకపోవడం దురదృష్టకరం. స్వార్థం కోసం జీవించడం పశు ప్రవృత్తి. తనతో పాటు ఇతరుల బాగు కోసం కృషి చేయడం మానవ ప్రవృత్తి. తనకున్న దానిలో కొంత భాగాన్ని ఇతరుల కోసం వెచ్చించడం, ఆపదలో ఉన్నవారికి చేయూత, యుద్ధం ఏ దేశాల మధ్య జరిగినా, చివరకు నలిగిపోనివ్వడం మానవతా దృక్పథానికి నిదర్శనాలు. ఆకలి, నిరాశ్రయం, ప్రాణభయం అనేవి ఏ మతానికో, జాతికో పరిమితం కావు. బాంబుల మోత మధ్య వినిపించే పసిపిల్లల ఏడుపులో ఉండే వేదన ప్రపంచ వ్యాప్తంగా ఒకటే. అక్కడ మానవత్వం అంటే గాయపడిన వారికి సాయం చేయడం, శరణార్థులకు నీడ ఇవ్వడం. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా అడవులకు వెళ్లి తపస్సు చేయడం మాత్రమే కాదు. తోటి మనిషిలోని దైవత్వాన్ని గుర్తించి, ప్రేమతో సేవ చేయడమే నిజమైన ఆధ్యాత్మికత.

“మానవ సేవయే మాధవ సేవ” అనే సూక్తి మానవత్వానికి, ఆధ్యాత్మికతకు ఉన్న విడదీయలేని బంధాన్ని తెలియజేస్తుంది. మానవతా దృక్కోణం ప్రకారం, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక విలువ ఉంటుంది. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి మనిషి గౌరవించబడాలి. ఎదుటి వారిలో లోపాలను వెతకడం కంటే, వారిలోని మంచితనాన్ని, వారి అవసరాలను గుర్తించడం ఇందులో ప్రధానం. ఇది మానవతా దృక్కోణానికి వెన్నెముక వంటిది. ఒక వ్యక్తి పడుతున్న బాధను మన బాధగా భావించడంసహానుభూతి. “నాకు జరిగితే ఎలా ఉంటుంది?” అని ఆలోచించినప్పుడు మనలో కరుణ ఉదయిస్తుంది. ఈ కరుణే సమాజంలోని అశాంతిని తొలగిస్తుంది. ఆధ్యాత్మికత దృక్కోణంలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ ఒకే పరమాత్మ వెలిగిపోతున్నాడు. ఉపనిషత్తులు “ఈశావాస్యం ఇదం సర్వం” అని బోధిస్తున్నాయి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు, మనిషికి మనిషికి మధ్య కుల, మత, వర్ణ విభేదాలు తొలగిపోతాయి. ఎదుటివారి బాధను తన బాధగా భావించే గుణమే మానవత్వం. భారతీయ ఆధ్యాత్మికత “ఆత్మవత్ సర్వభూతాని” అని చెబుతుంది. భగవంతుడు పేదవాడిలోనూ, పొరుగువారిలోనూ ఉన్నాడని గుర్తించాలి. అహంకారం మనిషి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అతిపెద్ద అడ్డంకి. “నేను, నాది” అనే స్వార్థం ఉన్నచోట మానవత్వం వర్ధిల్లదు. అహంకారాన్ని వదిలి, అందరినీ సమానంగా చూస్తే, మనలో దయ, కరుణ, దైవిక గుణాలు మేల్కొంటాయి.

ఆధ్యాత్మిక సాధన వల్ల మనసు నిర్మలమై, పరుల పట్ల ప్రేమ కలుగుతుంది. అందరిలో ఒకడే పరమాత్మ నివసిస్తున్నాడనే జ్ఞానం కలిగేంత వరకు ఈ అభ్యాసం తైలధారలాగ కొనసాగాలి. మానవత్వంతో జీవించడం సార్థకత. “మతం కన్నా మానవత్వం మిన్న” అని గ్రహించినప్పుడు సమాజం స్వర్గధామం అవుతుంది. మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో మానవత్వం ప్రతిబింబించినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యమవుతుంది. “ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశార్జున తిష్ఠతి” అనే గీతా వాక్యం సర్వజీవుల్లో దైవత్వాన్ని తెలియజేస్తుంది. దేవుడు నీలో, నాలో, ఒక చిన్న చీమలో కూడా ఉన్నాడు. ఈ ఏకత్వ దర్శనం మానవజాతికి అత్యున్నత సంస్కారం. యుద్ధం, తప్పుడు సమాచారం, ద్వేషం మధ్య కూడా సానుభూతి, శాంతి కోసం గళం ఎత్తడం కూడా మానవత్వమే.

– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008577834

Leave a Reply