అమరావతి పై వైసీపీ అసలు స్టాండ్ ఏమిటి?

అమరావతి పై వైసీపీ అసలు స్టాండ్ ఏమిటి?

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ

విజయవాడ, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని విషయంలో వైసీపీ వైఖరి ఎప్పటికప్పుడు మారుతూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని, అమరావతి పై వైసీపీలో ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని, అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ప్రశ్నించారు. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, ఒకప్పుడు అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా అంగీకరించిన జగన్ అండ్ కో, తరువాత మూడు రాజధానుల పేరుతో రైతుల ఆశలను దెబ్బతీశారని విమర్శించారు. అమరావతి కోసం వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని, వారి త్యాగాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత రాబోతున్న నేపథ్యంలో ఇది రైతుల పోరాటానికి, త్యాగానికి లభించిన గౌరవమని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అమరావతిని 2028 నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోందని, ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో దేశం గర్వించదగ్గ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రాంతీయ అసమానతలు లేకుండా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఎలాంటి అర్థం లేదని, గతంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని గద్దె అనురాధ విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ వ్యవహరించడం బాధాకరమని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తిగా సురక్షితమని, రైతుల నమ్మకం, ప్రజల ఆశయాలు, ప్రభుత్వ నిబద్ధతతో అమరావతి నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా అమరావతిపై వైసీపీ నేతలు విషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పింఛన్లను గణనీయంగా పెంచి ప్రతి అర్హుడికి సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీకి పింఛన్లు అందేలా కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఒకటో తేదీ సెలవు దినంగా వస్తే ముందురోజే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. వైకాపా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని సతీష్, రాజేశ్వరి, తోట పాండు, కారంపూడి సత్య, కడియం ప్రకాష్, ఆరాధ్యుల విజ్జి, రాజు, శశి, అనపర్తి శివప్రసాద్, డేవిడ్ నెమలకంటి కుమారు, లలిత కుమారి రేఖ, ప్రభావతి, లక్ష్మీదేవి, సింహాచలం తదితరులు ఉన్నారు.

Leave a Reply