25th Jan 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

25th Jan 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

25th Jan 2026 ఈ సంచికలో…

1 ముఖపత్ర కథనం

2 మనసు-మాట (శీర్షిక)

3 కబుర్లు (శీర్షిక)

4.పోటీ (కథ)

5.సన్నిహితం… (శీర్షిక)

6.మెదడుకు మేత-సామెత.. (శీర్షిక)

7.వినరో భాగ్యము – (శీర్షిక)

1 ముఖపత్ర కథనం

భూమికి ఆకాశానికి మధ్య నిలిచిన ప్రకృతి శివలింగ క్షేత్రం

25th Jan 2026 | చిత్తూరు జిల్లాలోని పులిగుండు ఆలయ విశేషాలు
పులిగుండు పేరు వెనుక ఉన్న కథ
ప్రకృతి చెక్కిన శివ–పార్వతి స్వరూప శిలలు
పులిగుండు యాత్ర: భక్తి, సాహసం, అనుభూతి
చారిత్రక ప్రాధాన్యత కలిగిన పులిగుండు
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పులిగుండు
పులిగుండేశ్వర స్వామి జాతరలు, ప్రత్యేక పూజలు

25th Jan 2026 |చిత్తూరు జిల్లాలో వెయ్యి అడుగుల ఎత్తులో వెలసిన పులిగుండు ఆలయం ప్రకృతి, ఆధ్యాత్మికత, చరిత్రల సమ్మేళనంగా భక్తులను ఆకర్షిస్తోంది.

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు. చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పవిత్ర ప్రాంతాల్లో పులిగుండు ఒకటి. చిత్తూరు నగరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో, తిరుపతికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం భూమి మట్టం నుంచి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో వెలసి, ఆధ్యాత్మికతకు-ప్రకృతిసౌందర్యానికి అద్భుతమైన సంగమంగా నిలుస్తోంది. లింగాకారంలో దర్శనమిచ్చే రెండు భారీ రాతి గుండ్లు, ఈ జంట శిలలను చూస్తే శివ, పార్వతుల స్వరూపాలుగా భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

25th Jan 2026
25th Jan 2026

ఈ రెండు గుండ్లను చూస్తే రెండు కళ్ళు చాలవు అన్న భావన కలుగుతుంది. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు… అన్నీ కలిసి పులిగుండును ఒక సహజ అద్భుతంగా తీర్చిదిద్దాయి. ప్రతి మెట్టు ఎక్కుతున్నప్పుడు ఒళ్ళంతా గగుర్పొడిచే అనుభూతి కలుగుతుంది. ఒకవైపు భయం, మరోవైపు భక్తి… ఈ రెండింటి మధ్య సాగేది పులిగుండు యాత్ర. పులిగుండు అనే పేరు ఎలా వచ్చింది అన్నదానికీ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పులులు సంచరించే అటవీ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.

కొండ గుహల్లో పులులు తలదాచుకునేవని స్థానికులు చెబుతారు. పులి గాండ్రిస్తే చుట్టుపక్కల కొండల్లో మేతకు వెళ్లిన పశువులు చెల్లాచెదురయ్యేవని పెద్దలు గుర్తుచేస్తారు. ఆ కారణంగానే ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరు స్థిరపడింది.

నేటికి నాలుగు దశాబ్దాల క్రితం వరకు పులిగుండు పైకి ఎక్కేందుకు సరైన మార్గమే లేదు. తాళ్లు, నిచ్చెనల సహాయంతో, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భక్తులు కొండపైకి చేరేవారు. ఆ సమయంలోనే ఈ ప్రాంత మహిమను, ప్రాశస్తిని గుర్తించిన జ్ఞానేందర్ రెడ్డి తొలిసారిగా త్రాడుల సాయంతో గుండుపైకి ఎక్కి అక్కడున్న అద్భుతాలను ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పం చేసుకున్నారు. అదే సంకల్పం ఈనాడు పులిగుండును ఒక ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చింది.

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సో సలహాదారుగా పనిచేసిన మహాసముద్ర జ్ఞానేందర్ రెడ్డి రెడ్డి,

ఆయన సోదరుడు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాసాగర్ రెడ్డి చొరవతో, పూర్తిగా సొంత నిధులతో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో గుండుపైకి చేరుకునేలా రాతి మెట్ల మార్గం, ఇనుప మెట్ల దారి ఏర్పాటు చేశారు. భూమి లోతుల నుంచి లావాలా పొంగి వచ్చినట్లుగా కనిపించే రెండు లింగాకార రాళ్ల మధ్య ఇనుప మెట్లను ఏర్పాటు చేసి, శివ-పార్వతుల దర్శనాన్ని సులభతరం చేశారు. రెండు గుండ్ల పైభాగం విస్తీర్ణం సుమారు రెండు ఎకరాల మేర ఉండటం విశేషం.

పులిగుండు పైకి చేరితే అక్కడి నుంచి కనిపించే దృశ్యం మరిచిపోలేనిది. వందల సంఖ్యలో గ్రామాలు కంటపడుతూ, ప్రకృతి వైభవం మనసును హత్తుకుంటుంది. పైభాగంలో శివ-పార్వతులతో పాటు సాయిబాబా, వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, నవగ్రహాల ఆలయాలు దర్శనమిస్తాయి. కొండ మధ్య భాగంలో విఘ్నేశ్వరుడు, శ్రీ వేంకటేశ్వరుడు, లక్ష్మీదేవి ఆలయాలు ఉండగా, అడుగున మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి స్వామి దర్శనం సంప్రదాయంగా ముందుగా చేస్తారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరుగుతుంటాయి. సంక్రాంతి పండుగ ముగిసిన నాల్గవ రోజు జరిగే జాతర సమయంలో ఇసుక వేస్తే కింద పడనంతగా భక్తులు గుమిగూడుతారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పులిగుండేశ్వర స్వామి దర్శనానికి తరలివస్తుంటారు. పెళ్లిళ్లు చేసుకునేందుకు కళ్యాణ సత్రాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం. తక్కువ అద్దెతో ఇచ్చే ఈ సత్రాల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ఆలయ అభివృద్ధికే వినియోగిస్తున్నారు.

25th Jan 2026
25th Jan 2026

పులిగుండు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ఒక చారిత్రక కేంద్రం కూడా. కార్వేటినగరం రాజుల పాలన కాలంలో కల్లూరు, పాకాల, పాళ్యం, మొగరాల, పులిచెర్ల, రొంపిచెర్ల, నర్గతి, తుంబ వంటి ప్రాంతాల పాలెగాళ్లు బ్రిటీష్ పాలకులకు ఎదురు నిలిచినప్పుడు, ప్రాణరక్షణ కోసం పులిగుండులోని గుహలను ఆశ్రయించినట్లు చరిత్ర చెబుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ కొండలు వారికి సహజ రక్షణగా నిలిచాయి. నేటికీ ఇక్కడ కనిపించే రాతి నిర్మాణాలు, శిల్పసౌందర్యం ఆ కాలపు ఆనవాళ్లను స్పష్టంగా గుర్తు చేస్తాయి.

ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత విశ్రాంతి భవనం, వసతి గదులు, రెస్టారెంట్, కళ్యాణమండపాలు ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో పనిచేసే వారు మైండ్ రిలీఫ్ కోసం రోడ్డు మార్గాన వచ్చి పులిగుండు ప్రదక్షిణ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారో, అలానే పులిగుండు వద్ద కూడా చేయాలన్న ఆలోచనకు రూపకల్పన జరుగుతోంది.

మహాసముద్రం నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి కుటుంబీకులు సహా పులికెళ్లు గ్రామస్తులు ఈ క్షేత్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. వారి సేవా భావన వల్లే పులిగుండు నేడు జిల్లాకే వన్నె తెచ్చే స్థాయికి ఎదిగింది. ప్రభుత్వం మరింత చొరవ చూపితే, ఇది ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక-ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అన్ని అవకాశాలూ ఉన్నాయని దయాసాగర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. మార్చి 6వ తేదీన పులిగుండేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన టిటిడి వేద పండితుల చేతుల మీదుగా జరగనుండటం మరో విశేషం. తిరుపతి వెంకన్న, కాణిపాకం వినాయక స్వామి ఆలయాల్లాగే పులిగుండు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఒక మహా పుణ్యక్షేత్రంగా నిలవాలని భక్తుల ఆకాంక్ష. ప్రకృతి నిర్మించి ఇచ్చిన భారీ శివలింగంలా కనిపించే పులిగుండు, ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి మూడింటినీ కలబోసుకున్న అరుదైన క్షేత్రం. శివపార్వతుల కృపతో, ప్రజల సహకారంతో, ఐక్యమత్యంతో పులిగుండు మరింత వెలుగులు ప్రసరించాలన్నదే భక్తుల ఆకాంక్ష.


సాటి గంగాధర్,

బ్యూరో చీఫ్, ఆంధ్రప్రభ, చిత్తూరు.


_-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-_

2 మనసు-మాట శీర్షిక

శరణ్య (గొప్యత కోసం క్లయింట్ డీటెయిల్స్ మార్చబడ్డాయి.)మనసు మాట : నా పేరు శరణ్య. నా వయసు 34 సంవత్సరాలు. నేను విడాకులు తీసుకొని 5 సంవత్సరాలయ్యింది. నా భర్తకి నాకు మనస్పర్థలు చాలా వచ్చాయి. పెళ్ళైనప్పటి నుంచి నేను ఎలా మారాలి అన్నది మా అత్తగారు మరియు మా వారు నిర్ణయించేవారు. ఇద్దరూ కూర్చొని నా ప్రతీ ప్రవర్తనను బూతద్ధంలో పెట్టి చూసినట్టు పరిశీలించి జడ్జ్ చేసేవారు. చివరకి మా మధ్య గొప్యంగా ఉండవల్సిన విషయాలు (బెడ్రూము విషయాలు) కూడా నా ఎదురుగుంటానే చర్చించేవారు. ఇవి విని విని నా ఓపిక నశించింది. దీనికి తోడు పెళ్లయి రెండు సంవత్సరాలకు కూడా మాకు శారీరిక సంబంధం ఏర్పడలేదు.

ఆయనకు సమస్య వుంది అని డాక్టర్లు చెప్పినా సరే సమస్య నాకే వుంది అన్నట్టు చిత్రీకరించి నన్ను నిందించేవారు. ఇది తట్టుకోలేక విడాకులు తెసుకోవాలని నిర్ణయించుకొని, నా నిర్ణయం నా తల్లితండ్రులకు చెప్పాను. వాళ్ళు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సర్దుకుపోవాలి అని చెప్పారు. నాకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండడంతో నా బ్రతుకు నేను బ్రతక గలను అన్న ధైర్యంతో డివోర్స్కి అప్లై చేశాను. నాకు డివోర్స్ రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాలలో చాలా నిందలు ఎదురుకున్నాను, వాళ్ళు నా మీద వేసిన అన్నీ నిందలు నిజం కాదని తేల్చి నాకు విడాకులు మంజూరయ్యేసరికి చాలా క్షోభ అనుభవించాను.

నా ఈ ఒంటరి పోరాటం చిన్నప్పటి నించి నాకు అలవాటయ్యింది. నా చదువు, పెళ్ళి, ఉద్యోగం – వంటి పెద్ద నిర్ణయాలతో పాటు చచిన్న చిన్న నిర్ణయాలు మా నాన్నగారు తీసుకున్నవే. మా ఇంట్లో మా అమ్మకగారికి నిర్ణయం తీసుకోగలిగే స్వేచ్ఛ లేదు. ఆడవారికి గౌరవం ఇచ్చే సంస్కారం మా కుటుంబంలో లేదు. మా అన్నయ్యకు ఎక్కువ విలువ ఇవ్వటం, తనతో నన్ను పోల్చడం. నేనంటే ఈ చిన్నచూపు ఉండటం వలన మా నాన్నే కాకుండా మా అన్నయ్య కూడా నన్ను కొట్టేవాడు. ఇలా ముగ్గురి మగవారి వలన నా జీవితంలో చాలా కష్టపడ్డాను. ఉద్యోగరిత్యా మంచి హోదాలో వున్నాను. ఇక ఒంటరి జీవితం సజావుగా సాగుతుంది అనుకున్న సమయంలో నాకు థైరాయిడ్ గ్రంధి కాన్సర్ వుంది అని తెలిసింది. అది నయమయ్యి జీవితం గాడిలో పడింది అనుకుంటున్నప్పుడు ఓవరీలో సిస్ట్స్ వున్నాయి, సర్జరీ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఇలా నా శారీరిక ఆరోగ్యం క్షీనించడానికి నేను పడ్డ వత్తిడి కారణమా? నేను వత్తిడిని ఎలా అదిగమించవచ్చు.

సైకాలజిస్ట్ మాట: శరణ్య, మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అణచివేతలు ఎదుర్కొన్నారు. ఇలాంటి అనుభవాలు మన మానసిక మరియు శారీరిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

Psychoneuroimmunoendocrinology(PNI) అంటే మనసు (Psychology), నాడీ వ్యవస్థ (Neurology), రోగనిరోధక వ్యవస్థ (Immunonology), మరియు గ్రంధి వ్యవస్థ (Endocrinology) మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.

సరళంగా చెప్పాలంటే, మన ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి మన శరీరంలోని హార్మోన్లు, రోగనిరోధక వ్యవస్థ, మరియు నాడీ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేసే శాస్త్రం PNI

శరణ్య, డాక్టర్ గాబర్ మేట్ పని మరియు PNI అధ్యయనాలు ప్రకారం, భావోద్వేగ అణిచివేత (Emotional Repression) క్యాన్సర్‌కు ఒక ముఖ్యమైన కారకం ఎందుకంటే భావోద్వేగ అణిచివేత (Emotional Repression) వలన:

  • రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది.
  • హార్మోనల్ మార్పులు వస్తాయి.
  • క్యాన్సర్ పునరావృతం అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది.

గాబర్ మేట్ సిద్ధాంతం ప్రకారం, భావోద్వేగాలను అణిచివేసే వ్యక్తులు క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారు. ఇది టైప్ సి వ్యక్తిత్వం (Type C Personality) అని పిలువబడుతుంది.

టైప్ సి వ్యక్తిత్వ లక్షణాలు:

  • భావోద్వేగ అణిచివేత: ప్రతికూల భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో ఇబ్బంది.
  • పరిపూర్ణత్వం మరియు స్వీయ-త్యాగం: ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం.

గాబర్ మేట్ పని ప్రకారం, ఈ లక్షణాలు ఒత్తిడికి దారితీసి, రోగనిరోధక పనితీరును ప్రభావితం చేస్తాయి. శరణ్య, మీరు పెరిగిన ఇంట్లో మరియు మీరు పెళ్ళి చేసుకుని వెళ్లిన ఇంట్లో మీ భావాలకు, ఆలోచనలకు, ప్రవర్తనకు, మీ వ్యక్తిత్వానికి, అసలు మీ ఉనికికే విలువ లేకపోవడంతో మీరు మీ భావాలను వ్యక్తపర్చుకోలేక రిప్రెస్ చేసుకున్నారు. మీ శారీరిక మరియు మానసిక ఆరోగ్యం క్షీనించడానికి ముఖ్య కారణాల్లో ఎమోషనల్ రిప్రెషన్ ఒకటి.

శరణ్యకు సూచనలు:
శరణ్య, వత్తిడిని అధిగమించాలంటే మీరు చేయాల్సినవి:

“నేను నన్ను ప్రేమిస్తాను మరియు నన్ను నేను చూసుకుంటాను.”

మీకు నచ్చిన పనులు చేయడం, విశ్రాంతి తీసుకోవడం.

మీ భావోద్వేగాలను సురక్షితంగా వ్యక్తీకరించడం 🗣️.

మిమ్మల్ని మీరుగా స్వీకరించే వారిని మీ సపోర్ట్ సిస్టమ్‌గా నిర్మించుకోవడం 👥.

మైండ్‌ఫుల్‌నెస్ మరియు మెడిటేషన్, యోగ, వ్యాయామం వంటివి నేర్చుకోవడం.

మానసిక ఆరోగ్య నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవడం 🤝.

జర్నలింగ్:మీ భావోద్వేగాలు మరియు ఆలోచనలను వ్రాయడం 📝.

సపోర్ట్ గ్రూప్‌లో చేరడం: ఇలాంటి అనుభవాలున్న వ్యక్తులున్న గ్రూప్ లో చేరడం మరియు మాట్లాడటం 👥. మైండ్ వాయిస్: శరణ్య మీ ఆరోగ్యం మరియు సంతోషం మెరుగు పడాలంటే ఈ మాటలను పదే పదే మీ మైండ్లో చెప్పుకొని మీ మైండ్ వాయిస్ చేసుకోండి:

“నేను నా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి అర్హురాలిని.”

“నా భావాలకు గౌరవించే వాళ్లకు దగ్గిరగా, అగౌరపరిచేవాళ్లకు దూరంగా ఉండడం నా హక్కు”

————————————————————————————————–


3 కబుర్లు (శీర్షిక)

DEC 2025

జైలు -ఉద్యోగం

జైలులో…ఎక్కువ భాగం 8×10 అనే కొట్ లో  గడపాలి. 

ఉద్యోగంలో… ఎక్కువ భాగం 6×8 అనే క్యూబికల్‌లో గడపాలి. 

జైలులో…ముప్పూటలా భోజనం దొరుకుతుంది.

ఉద్యోగంలో…భోజన విరామం రోజుకు ఒక్కసారే!

జైలులో…సత్ప్రవర్తనకు శిక్షాకాలం తగ్గుతుంది.

ఉద్యోగంలో…మంచి ప్రవర్తనకు బహుమతిగా

మరింత  పని పెరుగుతుంది. 

జైలులో…ఒక గార్డు మీ కోసం తలుపు తాళాలు వేసి తీస్తాడు . 

ఉద్యోగంలో…మీరే ఒక సెక్యూరిటీ కార్డుతో  తలుపు తాళాలు మీరే తీసి  వేసుకోవాలి.

జైలులో…మీరు టీవీ చూడవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు. 

ఉద్యోగంలో…టీవీ చూసినా  ఆటలు ఆడవా  ఉద్యోగం ఊడుతుంది. 

జైలులో…ములాఖత్ పేరుతో కుటుంబాన్ని కలుసుకోవచ్చు. 

ఉద్యోగంలో…మీరు సంబంధంతో లేని వాళ్ళతో మాట కలిపితే ఉద్యోగం  మటాష్!

జైలులో…పన్నులు కట్టే బాదరబందీ లేకుండా సౌకర్యాలు అను భవించ వచ్చు.

ఉద్యోగంలో…మీకు  చేకూరే సౌకర్యాలకు జీతంలో కోత ఉంటుంది.

జైలులో…బార్  నుంచి బైటకు వచ్చే సమయం కోసం  ఎదురుచూస్తారు. .

ఉద్యోగంలో .. పని ముగించుకొని బార్ (పబ్‌) కు ఎప్పుడు వెళదామా అని తొందరపడతారు.

జైలులో… జైలరు అప్పుడప్పుడన్నా దయ చూపిస్తాడు.

ఉద్యోగంలో…  మేనేజరు దృష్టిలో దయ అనే మాటకే అర్థం ఉండదు.

మరి ఇప్పుడు చెప్పు!

జైలు కావాలా ? ఉద్యోగం కావాలా? ఉద్యోగమే కావాలి.. నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలిగా!

———————————————————————-

4) పోటీ (కథ)


“కాఫీ తాగారా?” ఫోన్ లో అడిగింది అనసూయ.
“లేదింకా.” మంద్రస్వరంతో అన్నాడు రమణమూర్తి.
“ఏడున్నరవుతోంది. ఇందిర ఎటు వెళ్ళింది? పాలవాడు రాలేదా ఈరోజు?” ఆదుర్దాగా అడిగింది అనసూయ.
“వచ్చాడు. ఇందిర గుడికి వెళ్లాలట.” మెల్లగా అన్నాడు రమణమూర్తి.
“ఫోన్ ఇందిరకు ఇవ్వండి.” అని,
ఇందిర ఫోన్ తీసుకోగానే,”ఇందిరా! మామయ్యకు కాఫీ ఇచ్చేసి వెళ్ళమ్మా గుడికి” అంది అనసూయ శాంతంగా.
“గుడికి వెళ్ళొచ్చాక ఇస్తాను. ఉష ముందే వెళ్ళిపోయి ఉంటుంది. నేను తర్వాత మాట్లాడుతాను అత్తయ్యా” అంటూ ఫోన్ కట్ చేసింది ఇందిర.
మనసు చివుక్కుమంది అనసూయకు.
ఈలోపు రమణమూర్తే ఫోన్ చేశాడు.
“అనూ! పోనివ్వు. కాఫీ నేనే కలుపుకుంటాను” అన్నాడు.
“మీకు చేయి బాలేదు కదండీ. డాక్టర్ పనులేమి చేయొద్దు అన్నాడు కదా. ఉండండి. ఉషకు ఫోన్ చేస్తాను.” అంటూ ఫోన్ కట్ చేసి,
రెండో కోడలు ఉషకు ఫోన్ చేసింది అనసూయ.
“హలో అమ్మా!” అన్న కొడుకు గొంతు విని
“చిన్నా! ఉషకి ఫోన్ ఇవ్వు” అంది.
” అమ్మా! ఉష ఇందాకే గుడికి వెళ్ళింది. నేనూ వెళ్తున్నా. తర్వాత చేస్తాను. ” అని ఫోన్ పెట్టేసాడు చిన్నా.
‘కూతురుకి నెలలు నిండాయని, సాయం కోసం దేశం కాని దేశం వచ్చింది. మీరు వెళ్ళండత్తయ్యా మామయ్య గారిని మేము చూసుకుంటాం, అని కోడళ్ళు గట్టిగా హామీ ఇస్తేనే తను కదిలింది.
ఇప్పటికిది నాలుగోసారి ఇలా జరగడం.
నోములు, వ్రతాలు, పూజలు అంటూ ఒకరిని మించి ఒకరు పోటీలు పడుతున్నారు కానీ, డెబ్భై అయిదేళ్ల ఏళ్ల వ్యక్తి అవసరాలు కాస్త దగ్గరుండి చూసుకుందాం అని లేదు ‘ అంటూ నిట్టూర్చింది అనసూయ. “తండ్రిలాంటి మామగారి అవసరాలు గుర్తించి, అందించడంలో ఉన్న పుణ్యాన్ని మరచి పూజలు పునస్కారాలంటూ తిరుగుతున్నారు. ఇవి నిజంగా పుణ్యం కోసం, భక్రితో చేస్తున్న పూజలా, లేక ఆడంబరాల కోసం, ఒకరికంటే మేమూ ఏం తీసిపోం అని అంచుకోవడానికా? ” ఆమె మనసులో కోడళ్ళ ప్రవర్తనల పట్ల ఎన్నో సందేహాలు.
తాను అనుకునేదే నిజమయితే గనక, భవిష్యత్తులో వాళ్ళమధ్యన పూజల పోటీ పెరిగిపోతుంది, తనభర్తను పట్టించుకునేవారుండరు..ఈ ఆలోచన వచ్చిందే తడవు, కూతురికి డెలివరీ ఎప్పుడవుతుందా తాను భర్త దగ్గరికి ఎప్పుడు వచ్చేసి ఆయన సం రక్షణ తానే స్వయంగా చూసుకుంటానా అని ఎదురు చూడసాగింది అనసూయ.
అత్తా-మామల సం రక్షణను విస్మరించే కోడళ్ళెందరో. వారికి వత్తాసు పలకడం, లేదా ఎటూ మాట్లాడలేక మౌనంగా ఉండే కొడుకులెందరో.


5.సన్నిహితం… శీర్షిక

DEC 2025

ఊహలతో భయం…

ఏదైనా సమస్య వచ్చిందంటే మనకు భయంగా ఉంటుంది దాన్ని ఎలా పరిష్కరించాలా అని. అయితే అన్ని సార్లు సమస్యలు నిజంగా రావు.వస్తాయి ఏమో అని మనం పడుతున్న భయమే ఎక్కువ ఉంటుంది.
దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను.
ఒకసారి మా బాస్ నా పని ఎంతకీ కంప్లీట్ అవడం లేదని కోపంగా ఉన్నాడు. వీకెండ్ లోపల కంప్లీట్ చెయ్యాలని పట్టుదలగా ఉన్నాను నేను. అయితే వీకెండ్ వచ్చేసరికి పని దాదాపు పూర్తయింది.ఇంతలో మా బాస్ వచ్చి పని గురించి అడిగి , మిగతా మిగిలిన వర్క్ సోమవారం పొద్దున్న చూస్తాను రడీగా ఉండు అని నాతో చెప్పి వెళ్ళిపోయాడు.ఆ రోజు నేను ఇంటికి వచ్చేశాక సడన్ గా వేరే ఊరు వెళ్లాల్సిన పనిపడింది. కుటుంబ సమేతంగా వెళ్ళాను. అక్కడ బంధుమిత్రులను కలిశాను. అందరూ కలవడంతో ఎంతో సంతోషంగా గడిపే అవకాశం వచ్చింది.నా భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు.కానీ నేను మాత్రం మనసులో టెన్షన్ పడుతూ డల్ గా ఉన్నాను. సోమవారం పొద్దున్న నా బాస్ కి పని ఎలా చూపించాలి , అతన్ని ఎలా కన్విన్స్ చెయ్యాలి అన్న ఆలోచనలు నా బుర్రలో తిరుగుతూ ఉండటం వల్ల ఆ సంతోష సమయాన్ని ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాను.
మొత్తానికి అక్కడ పని పూర్తయ్యాక మా ఊరు వచ్చేశాం.సోమవారం పొద్దున్న ఆఫీసుకు ఆదరా బాదరాగా పడుతూ లేస్తూ వెళ్ళాను. పని చేయడం మొదలు పెట్టాను.బాస్ నా దగ్గరకి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను.అయితే ఆ రోజు బాస్ రాలేదు అని నెమ్మదిగా తెలిసింది. ఒక్క క్షణం నా మీద నాకే జాలి కలిగింది.
సోమవారం ఫేస్ చెయ్యాలని సమస్య గురించి గత రెండు రోజులుగా నేను పడిన టెన్షన్ , భయం గుర్తుకు వచ్చాయి.దాని కారణంగా నేను ఎంజాయ్ చెయ్యక నా ఫ్యామిలీ మెంబర్స్ తో సరిగ్గా ఉండక నేను ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు చూస్తే అసలు సమస్యకు మూలకారణం అయిన బాస్ లేనే లేడు .
అదే నేను చెప్పాలి అనుకున్నది.
సమస్యలు వస్తాయి అని ఊహించుకుని భయపడతాం మనం నిత్య జీవితంలో.ఇది అనవసర భయం కదా. సమస్య వస్తే ఎలాగూ ఎదుర్కోక తప్పదు అప్పుడు చూద్దాం. ఇలా అనుకుంటే మనకు , మన చుట్టూ ఉన్నవాళ్ళకు ఎంత శాంతి గా ఉంటుందో కదా ఫ్రెండ్స్ !!!


6.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

మింగమెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె


తిండికి లేకపోయినా, డాబులకు దర్పాలకు పోయి, ఇబ్బంది పడెవారిని చూసి, ఎగతాళి చేస్తారు ఈ సామెతతో! సంపంగి నూనె చాలా ఖరీదైనది. సంస్కృతంలో సంపంగిని చాంపేయము అని అంటారు. నారాయణ తీర్థుల వారు కృష్ణపరమాత్మను “చాంపేయనాసాగ్ర లగ్నసుమౌక్తిక” అని వర్ణించారు. సంపెంగ మొగ్గ వంటి ముక్కు అన్న అరుదైన పోలికను తన కావ్యంలో మొదట ఉపయోగించినవాడు తిమ్మన. అందుకే ఆయనకు ముక్కు తిమ్మన అనే పేరు వచ్చింది. ఇంగ్లీషులో మంగోలియన్ బడ్ అని పిలవబడే దీని పరిమళం అమోఘం. సుగంధ ద్రవ్యాల(సెంట్స్) తయారీలో ఇది ప్రముఖ పాత్రను పోషిస్తుంది. గులాబీ అత్తరు కథలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెప్పినట్లు జమీందార్లు, ఆస్థానాధీశులకే దీన్ని కొనడం సాధ్యం. అలాంటి దాన్ని, మింగడానికి మెతుకు లేని వాడు మీసాలకు పూసుకోవడం అంటే ఎచ్చులకు పోవడంలో పరాకాష్ట.


రాజకీయ నాయకులు కూడ ఈ మధ్య సామెతలను తమ ప్రత్యర్థులను విమర్శించడానికి ఉపయోగిస్తున్నారు. మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ గారు టాంజానియా దేశానికి మిలియన్ల కొద్దీ డాలర్లను సహాయంగా ప్రకటించారు. మినర్వా గారనే రాజకీయ విశ్లేషకుడు దీనిని ఈ సామెతతో పోల్చి విమర్శించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను, ప్రపంచసుందరి పోటీలను జరపడాన్ని, విమర్శించడానికి ప్రతిపక్ష నాయకులు ఈ సామెతతోనే విమర్శించారు. ఎవరన్నారు, రాజకీయ నాయకులకు సాహిత్యం తెలియదని?


మా బంధువొకాయన, మధ్యతరగతి మందహాసుడే. స్థోమతకు మించి, బ్యాంక్ లోన్ తీసి, పోష్ గా యిల్లు కట్టాడు. ఇంటీరియర్ డెకొరేషన్ కే పది, పన్నెండు లక్షలయిందని గొప్పగా చెప్పేవాడు. ఇక గృహప్రవేశానికి ఒక అయిదారు వందల మందిని పిలిచి, తినలేనన్ని ఐటెంస్ తో తిండి పెట్టాడు. తర్వాత తెలిసింది, సంపెంగ నూనెను మీసాలకు పూసుకోకూడదని. బ్యాంకు ఈ.ఎం.ఐ. లు కట్టలేక చేతులెత్తేస్తే, వాళ్ళు ఇల్లు వేలం వేసి, అప్పు కట్టించారు. ఇంత ఆడంబరం అవసరమా చెప్పండి. “యావత్ తైలం తావత్ వ్యాక్ఖ్యానం” అని సంస్కృతంలో ఒక సామెత ఉంది. దీపం సెమ్మెలో నూనె ఉన్నంత వరకు పురాణం చెబుతాడని. దుప్పటిని బట్టే కాళ్ళు ముడుచుకోమన్నారు.


కొన్ని సంపెంగ నూనెల్లా కనిపించినా, వాటి వల్ల పరోక్షంగా అభివృద్ధి జరుగుతుంది. ఇండియాకు బుల్లెట్ రైలెందుకు ? అని తీవ్రంగా ప్రశ్నిస్తూంటారు. ప్రధాని దుస్తులు ఎన్ని లక్షలవుతాయో చెప్పి విమర్శిస్తారు. నెసెసరీ ఈవిల్ అని ఇంగ్లీషులో ఒక ఉక్తి ఉంది. అవసరమైన చెడు అని దార్థం. “వస్త్రేణ వపుషా, వాచా” అంటే, మనం ధరించిన బట్టలతో, శరీరంతో, వాక్కుతో, ఇతరులను ఆకట్టుకోవాలట. మినిమం డీసెన్సీ అవసరమే కాని, బట్టల కోసం అప్పుల పాలవకూడదు కదా! మా అమ్మ అనేది, “బట్టలకు పెడితివో, భ్రష్టు పడితివో,” ఆమె జీవితంలో ఖరీదైన చీరలే ఎరుగదు పాపం ! అయినా ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండేది.


మెరమెచ్చుల కోసం వెంపర్లాడడం, దాని కోసం అప్పుల పాలవడం చాలా మందికి జీవన విధానం “సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్” కావాలి మనకు. షేక్ స్పియర్ మహాకవి. తన మర్చెంట్ ఆఫ్ వెనిస్” నాటకంలో “అంటానియో” తో ఇలా అనిపిస్తాడు. “నైదర్ ఎ బారోవర్ నార్ ఎ లెజెండర్ బి” ఋణం ఇవ్వకు, తీసుకోకు” మన నాగరికత ఇప్పుడు ఎలా విలసిల్లుతుందంటే, ఫోన్ లు చూసి మరీ లోన్ లు ఇస్తామంటారు. ఉన్నట్టుండి మనకు ఒక మెయిల్ వస్తుంది. “కంగ్రాట్స్! మీకు పది లక్షల ఋణం, షరతులు లేకుండా మంజూరైంది!” ఎవరడిగారురా నిన్ను?


మీసాలే లేనివాళ్ళ పని హాయి. వాళ్ళకు సంపెంగ నూనె పూసుకో వలసిన పనిలేదు! అనుకొంటే, సాంబారులో కాలేసినట్లే. వాళ్ళు ఏకంగా జుట్టుకే రాస్తారు. ఆ లెక్కన నూనె ఎక్కువ కావాలి. ఎంత చెట్టుకు అంత గాలి. అన్నట్లు . సంపెంగ నూనె ఆన్ లైన్ లో కూడ దొరుకుతుందండోయ్. ఈ.ఎం.ఐ. ఫెసిలిటీ కూడ ఉంది. ఆడవారికి ఈ బాధ లేదనుకుంటే దానికి పదింతలవి ఉన్నాయి. సో, ఇంకో సామెతతో వచ్చేవారం.


7.వినరో భాగ్యము – శీర్షిక

DEC 2025

కొండ కోనల్లోని మలయప్పస్వామి

తిరుమలలో మూల మూర్తికి ప్రతిరూపంగా నిత్య సేవా కైంకర్యాలలో, ఉత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవమూర్తి ని మలయప్పస్వామి అని పిలుస్తారు. 13 వ శతాబ్దం వరకు ఈ సేవల్లో ఉగ్ర శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని వినియోగించేవారు. ఒకసారి తిరువీధి ఉత్సవం జరుగుతుందగా తిరుమలలో పలు అవాంఛనీయ ఘటనలు జరిగాయి. అందరూ భయపడి స్వామి ని వేడుకుంటే ఒక భక్తుడి ద్వారా ఇకపై తిరుమల అడవుల్లోని మలయకొన ప్రాంతంలో ఉన్న విగ్రహాలను తెచ్చి వినియోగించాలని సూచించారు. స్వామి చెప్పిన చోట వెదకగా శ్రీదేవి భూదేవి సమేతులైన 3 అడుగుల పంచలోహ విగ్రహరూపుడుగా స్వామి కనిపించారు. ఆ స్వయంవ్యక్త మూర్తులను తెచ్చి నిత్య సేవా, అభిషేక,ఉత్సవ కార్యక్రమాలలో వినియోగించడం మొదలైనట్టు 1339 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది.

తిరుమలేశుని మూలమూర్తి ని ప్రతిబింభించే ఆ మూర్తిని మలయప్పస్వామి అని పిలుస్తారు. ఆయనే శతాబ్దాలుగా వివిధ సేవలలో, బ్రహ్మోత్సవాలలో తిరువీధుల్లో భక్తకోటికి దర్శనం ఇస్తుంటారు. ఎప్పుడూ స్వర్ణ కవచ ధారిగానే కనిపించే మలయప్పస్వామిని ఏడాదికి ఒక సారి 3 రోజులపాటు నిర్వహించే జేష్టాభిషేకం లో మాత్రమే దర్శించవచ్చును. ఆ మూడు రోజుల్లో స్వామి తొలి రెండురోజుల్లో వజ్ర, ముత్యాల కవచధారి గా కనిపిస్తారు. మూడవ రోజు ధరింప చేసే స్వర్ణ కవచంతోనే ఏడాది అంతా దర్శనం ఇస్తారు.

ఓం నమో వెంకటేశాయతిరుమలలో మూల మూర్తికి ప్రతిరూపంగా నిత్య సేవా కైంకర్యాలలో, ఉత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవమూర్తి ని మలయప్పస్వామి అని పిలుస్తారు. 13 వ శతాబ్దం వరకు ఈ సేవల్లో ఉగ్ర శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని వినియోగించేవారు. ఒకసారి తిరువీధి ఉత్సవం జరుగుతుందగా తిరుమలలో పలు అవాంఛనీయ ఘటనలు జరిగాయి. అందరూ భయపడి స్వామి ని వేడుకుంటే ఒక భక్తుడి ద్వారా ఇకపై తిరుమల అడవుల్లోని మలయకొన ప్రాంతంలో ఉన్న విగ్రహాలను తెచ్చి వినియోగించాలని సూచించారు. స్వామి చెప్పిన చోట వెదకగా శ్రీదేవి భూదేవి సమేతులైన 3 అడుగుల పంచలోహ విగ్రహరూపుడుగా స్వామి కనిపించారు. ఆ స్వయంవ్యక్త మూర్తులను తెచ్చి నిత్య సేవా, అభిషేక,ఉత్సవ కార్యక్రమాలలో వినియోగించడం మొదలైనట్టు 1339 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. తిరుమలేశుని మూలమూర్తి ని ప్రతిబింభించే ఆ మూర్తిని మలయప్పస్వామి అని పిలుస్తారు. ఆయనే శతాబ్దాలుగా వివిధ సేవలలో, బ్రహ్మోత్సవాలలో తిరువీధుల్లో భక్తకోటికి దర్శనం ఇస్తుంటారు. ఎప్పుడూ స్వర్ణ కవచ ధారిగానే కనిపించే మలయప్పస్వామిని ఏడాదికి ఒక సారి 3 రోజులపాటు నిర్వహించే జేష్టాభిషేకం లో మాత్రమే దర్శించవచ్చును. ఆ మూడు రోజుల్లో స్వామి తొలి రెండురోజుల్లో వజ్ర, ముత్యాల కవచధారి గా కనిపిస్తారు. మూడవ రోజు ధరింప చేసే స్వర్ణ కవచంతోనే ఏడాది అంతా దర్శనం ఇస్తారు.

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

click here for more

Leave a Reply