యడ్లపాడులో నాటికల మహోత్సవం ఘన ముగింపు…

యడ్లపాడులో నాటికల మహోత్సవం ఘన ముగింపు…

పోటాపోటీ ప్రదర్శనలు – అందరికీ న్యాయం చేసిన నిర్వాహకులు

యడ్లపాడు, ఆంధ్రప్రభ : పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు మూడు రోజుల పాటు రసవత్తరంగా సాగి ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. అత్యుత్తమ రచనలను ఎంపిక చేయడంతో ప్రతి నాటిక ప్రేక్షకులను అలరించడమే కాకుండా న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది.మూడు రోజుల్లో మొత్తం పది నాటికలు ప్రదర్శించగా, ఒకటి ప్రత్యేక ప్రదర్శనగా ఉండటంతో మిగిలిన తొమ్మిది నాటికల మధ్య కఠిన పోటీ నెలకొంది.18 మంది న్యాయనిర్ణేతలు ఇచ్చిన మార్కులు పరిశీలించగా, దాదాపు అన్ని నాటికలకు సమాన మార్కులు రావడం విశేషం.

కొన్నింటిలో టై ఏర్పడటంతో విజేతల ఎంపికలో నిర్వాహకులు సందిగ్ధానికి గురయ్యారు. చివరికి కళాకారుల్ని నిరాశపరచకుండా అదనపు బహుమతులు సృష్టించి అందరికీ న్యాయం చేశారు.
ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్‌ (హైదరాబాద్‌) వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక నిలిచింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బ్రతకనివ్వండి’, తృతీయ స్థానంలో స్వర్ణసూర్య డ్రామా లవర్స్‌ (హైదరాబాద్‌) వారి ‘స్త్రీమాత్ర నమః’, చతుర్థ స్థానంలో ఉషోదయ కళానిలయం (కట్రపాడు) వారి ‘మంచి మనసులు’ నాటికలు నిలిచాయి. ‘కన్నీటికి విలువెంత’, ‘మాతృత్వం’నాటికలు ప్రత్యేక బహుమతులు అందుకున్నాయి.

తెరవెనుక ప్రతిభకు గుర్తింపు..

ఉత్తమ రచనగా ‘మంచి మనసులు’, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ఎంపిక కాగా, దర్శకత్వం, సంగీత దర్శకత్వం ‘అమ్మ చెక్కిన బొమ్మ’కు లభించాయి. రంగాలంకరణలో ‘మమ్మల్ని బ్రతకనివ్వండి’,ఆహార్యంలో ‘చిటికెన వేలు’ నాటికలు ప్రతిభ కనబర్చాయి.

నటీనటుల ప్రతిభ ..

ఉత్తమ నటీమణులుగా జ్యోతిరాజ్ భీశెట్టి (‘అమ్మ చెక్కిన బొమ్మ’), ఆర్. రాజేశ్వరీ (‘మమ్మల్ని బ్రతకనివ్వండి’)ఎంపికయ్యారు. ఉత్తమ నటులుగా కార్తీక్ (‘స్త్రీమాత్ర నమః’), భానుప్రకాశ్ (‘అమ్మ చెక్కిన బొమ్మ’), కె. సత్యనారాయణ (‘చిటికెన వేలు’) నిలిచారు.ద్వితీయ ఉత్తమ నటులుగా వైబీ చౌదరి, పొగర్తి నాగేశ్వరరావు, ఉదయ భాగవతుల, పీఎస్ పవన్‌కుమార్, అమృత వర్షిణి బహుమతులు అందుకున్నారు.

మహిళా కళాకారులకు సత్కారం..

పోటీల్లో పాల్గొన్న 19 మంది మహిళా కళాకారులను ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ముత్తవరపు భార్గవి చౌదరి సత్కరించడం అందించడం జరిగింది.వీటితో పాటు ఉత్తమ రచన,దర్శకుల నగదు బహుమతుల్ని అందించి ప్రొత్సహించారు. ప్రజా జీవన సమస్యల్ని ఆవిష్కరిస్తూ సంఘాన్ని సంస్కరించే చైతన్య కిరణాలు పరిషత్ నాటికలని ఏపీ సాంస్కృతిక నాటక పరిషత్ అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు తెలిపారు.యడ్లపాడు పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం మూడో రోజు నాటికల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమకాలిన పరిస్థితులను కళారూపాలుగా చూపుతూ వాటిని పరిష్కరించే అస్త్రాలకు వేదిక రంగస్థలం అని అన్నారు.

కనుమరుగవుతున్న నాటక రంగానికి పరిషత్తులే జవసత్వాలు అందిస్తున్నాయన్నారు.నాటక రంగాన్ని పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న కళాకారులకు,కళాభిమానులకు, దాతలు,నిర్వాహకులు అభినందనీయులు అన్నారు.టీవీలు సినిమాలు ఓటీపీలు షార్ట్ ఫిలింలు వంటి సామాజిక మాధ్యమాలకు మూలం నాటకమే అన్నారు.యడ్లపాడు లో నిర్వహిస్తున్న సుందరయ్య కళా నిలయం పరిషత్తు నాటికల పోటీలు జాతీయస్థాయిలో నేడు దేశవ్యాప్తంగా ఖ్యాతి గణించటం సామాన్యమైన విషయం కాదన్నారు.

ఇక్కడి ప్రేక్షకులు ప్రదర్శనను వీక్షించేందుకు వేలాదిగా హాజరు కావడం అభినందనీయమన్నారు.అనంతరం చైతన్య భారతి సంగీతం నృత్య నాటక పరిషత్ అధ్యక్షులు రాయ ప్రోలు భగవాన్, ఈ ఏడాది ఉగాది పురస్కార గ్రహీత ఎఫర్ట్ డైరెక్టర్ జాస్తి వెంకట మోహన్ రావు, యడ్లపాడు ఎస్ ఐ టి.శివరామకృష్ణ, ప్రజాశక్తి మేనేజర్ హరికిషన్,డిప్యూటీ ఎడిటర్ రాంభూపాల్ సుందరయ్య కళానిలయం అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు చేస్తున్న కళాసేవను కొనియాడారు.

నాటికకు మంచి ఆదరణ లభించి కళల పండుగ దిగ్విజయానికి తోడ్పాటు అయింది.కళారంగ, సామాజిక సేవలకు సన్మాన సేవ..ఆదివారం రాత్రి జరిగిన ముగింపు సభకు పరిషత్‌ ప్రధాన కార్యదర్శి ముత్తవరపు రామారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి గా ఒంగోలు యెన్ టీ ఆర్ నాటక కళాపరిషత్ నిర్వాహుకులు ఈదర హరిబాబు,రచయిత, తెలుగు నాటకరంగ విశ్లేషకులు డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు విశిష్ట అతిధిగా హజరై ప్రసంగించారు.

సుదీర్ఘ కాలంగా నాటక కళాపరిషత్‌ల నిర్వహిస్తున్న వారు, కళాసేవతో పాటు సామాజిక సేవలు చేస్తూ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాన్ని అందుకున్న ఆరుగురిని పరిషత్‌ అధ్యక్షులు ముత్తవరపు సురేష్‌బాబు సన్మానించారు. వీరిలో ఒంగోలు ఎన్టీఆర్‌ కళా పరిషత్‌ ఈదర హరిబాబు, చైతన్య భారతి సంగీత, నృత్య నాటక కళా పరిషత్‌ రాయప్రోలు భగవాన్, పొన్నూరు కళా పరిషత్‌ నన్నపనేని రాఘవరావు, ఉగాది పురస్కార గ్రహీత ఎఫర్ట్‌ సంస్థ అధ్యక్షులు జాస్తి వెంకట మోహన్‌రావు, బుడ్డా వెంకట రామారావు, ఆంధ్ర నాటక కళాపరిషత్‌ అన్నమనేని ప్రసాదరావు, ఉగాది పురస్కార గ్రహీత కాట్రగడ్డ రామకృష్ట్ర ప్రసాద్‌లను ఘనంగా సన్మానం చేశారు.

నాటకరంగం అభివృద్ధికి అచంచలంగా కృషి చేస్తున్న పరిషత్‌ అధ్యక్షులు ముత్తవరపు సురేష్‌బాబు, పై ప్రశంసల జల్లులు కురిపించారు. కార్యక్రమంలో పరిషత్‌ గౌరవ సలహాదారులు జరుగుల రామారావు, నూతలపాటి కాళిదాసు, ఆలోకం పెద్దబ్బయ్య, ఉపాధ్యక్షులు జరుగుల శంకర్రావు, కార్యదర్శి నూతలపాటి మాధవరావు,సహాయ కార్యదర్శి చెరుకూరి సృజన, కోశాధికారి షేక్‌ బాజి, సభ్యులు నంబూరి శ్రీనివాసరావు, ముత్తవరపు పద్మారావు, పోపూరి అనంతలక్ష్మి, చెన్నుపాటి హనుమంతరావు, కల్లూరి సులోచన, తోకల కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కట్టా శ్రీహరి, సాంబశివరావు, పోపూరి శివరామకృష్ణ, జగన్, మాణిక్యమ్మ, మానుకొండ రామారావు ఉన్నారు.

Leave a Reply