2047 AP | మేం అధికారంలోకి వచ్చేసరికి..

2047 AP | మేం అధికారంలోకి వచ్చేసరికి..
2047 AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: 2024లో మళ్లీ మేము అధికారంలోకి వచ్చేసరికి ఏపీ అంతా సర్వనాశనం అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐఎస్బీ సౌత్ ఆసియా లెర్నింగ్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఐటీకి సూచికగా సైబర్ టవర్స్‌ను నిర్మించామని చంద్రబాబు తెలిపారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మా రంగంలో నంబర్ వన్‌గా నిలిచాయని అన్నారు.
వివిధ కారణాల వల్ల 2004లో ఓడిపోయామని, మళ్లీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, కానీ 2019 నుంచి 2024 మధ్య అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీల నిర్మాణం జరుగుతోందని, తిరుమలలో ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.


ఇక నుంచి కల్తీ నెయ్యి వాడే అవకాశం ఉండదన్నారు. గ్రీన్ ఇంధన తయారీలో ఏపీ అగ్రస్థానంలో ఉందని, త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందిస్తామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌ను మించేలా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
2047 AP | గ్యాస్ కొరత లాంటివి ఎదుర్కోంటున్నాం
అమరావతి హైదరాబాద్ ప్లస్ గా తయారవుతుంది. టెక్నాలజీని అనుసంధానించి స్మార్ట్ సిటీగా, బ్లూ గ్రీన్ రాజధాని నగరం నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో వివిధ అంశాలపై ఇబ్బందులు వస్తున్నాయి. గ్యాస్ కొరత లాంటివి ఎదుర్కోంటున్నాం, యుద్ధం తర్వాత మనల్ని మనం చాలా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
అమరావతి తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు పోలవరం, గోదావరిలో వచ్చే 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉందన్నారు. 2019 వరకూ 72 శాతం పనులు కూడా పూర్తి చేశాం. కానీ గత పాలకులు దానిని పట్టించుకోక ధ్వంసం చేశారు. రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రాం వాల్ వాళ్ల హయాంలో ధ్వంసమైపోయింది. మళ్లీ అదే పనిని రూ.1000 కోట్లతో చేపట్టాల్సి వస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇతర రాష్ట్రాలకూ ప్రయోజనం కలిగేలా చేస్తామన్నారు.
2047 AP | 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా
ఏపీలో మూడు రీజియన్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నాం, అమరావతిలో త్వరలోనే క్యాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. త్వరలోనే క్వాంటం కంప్యూటర్ తయారీకి అవసరమైన పరికరాల తయారీ కూడా చేసేలా చేస్తున్నాం, ఇప్పుడు గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశాం, ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా విజన్ డాక్యుమెంట్ రూపోందించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
