పెట్రేగిపోతున్న రేషన్ మాఫియా…

పెట్రేగిపోతున్న రేషన్ మాఫియా…

ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ రవాణా
జయంతి గ్రామానికి చెందిన సత్యనారాయణపై పీడీ యాక్ట్ నమోదు ఉదాహరణ

నందిగామ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా తీవ్ర స్థాయికి చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా పెట్రేగిపోతున్నదని పార్టీ జాయింట్ సెక్రటరీ మద్దుకూరు సాయిబాబు విమర్శించారు. నందిగామలో నిర్వహించిన పార్టీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధుల అండదండలతోనే అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగుతోందని ఆరోపించారు.

నెలవారీ మామూళ్ల కోసం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని విమర్శించారు. నందిగామ నియోజకవర్గంలోని జయంతి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు కావడం అక్రమ రేషన్ వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోందో చూపిస్తోందని పేర్కొన్నారు. జయంతి నుంచి కాకినాడ పోర్టు వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై కొన్ని పత్రికలలో కూడా కథనాలు వెలువడినట్లు సాయిబాబు తెలిపారు.

మండల స్థాయి నాయకులకు మామూళ్లు చెల్లిస్తూ అక్రమ వ్యాపారం కొనసాగుతోందని వార్తలు వచ్చినట్లు పేర్కొన్నారు. గత 20 నెలలుగా నందిగామ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతున్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. రెవెన్యూ యంత్రాంగం, ఆర్డీవో స్థాయి అధికారులు ఉన్నప్పటికీ అక్రమాలపై చర్యలు కనిపించడం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగడం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. అక్రమ రేషన్ బియ్యం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply