1stAprilchintana | దేవాలయ ప్రాముఖ్యతపై ఆధ్యాత్మిక విశ్లేషణ..

1stAprilchintana | దేవాలయ ప్రాముఖ్యతపై ఆధ్యాత్మిక విశ్లేషణ..

1stAprilchintana | ఇల్లు మరియు గుడి మధ్య తేడా
దేవాలయం అందరికీ సంబంధించిన పవిత్ర స్థలం
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం
గుడిలో సమానత్వం మరియు భక్తి భావం
ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రాధాన్యం
సమూహ ప్రార్థనల శక్తి
దేవాలయాల ద్వారా జీవిత సార్థకత

1stAprilchintana | ఇల్లు కన్న గుడి పదిలం అనే నానుడిని చాలా కాలం క్రితం నుండి ఎందరెందరో ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇల్లేమో భార్యాభర్త, వారి పిల్లలు సౌకర్యవంతంగా జీవించడానికి నిర్మించుకున్న నివాసస్థానము. స్థిరాస్థిగా పేర్కొనబడే ఈ ఇల్లు ఒక తరం గడిచిన తర్వాత వారి వారి వారసులకు మాత్రమే సంక్రమించేదిగా ఉంటుంది. తర్వాతి తరం వారు తమ తమ అవసరాలను, సౌకర్యాలను అనుసరించి రకరకాలుగా మార్పులు-చేర్పులు చేసుకునే అవకాశాలు నిండుగా, మెండుగా ఉంటాయి. ఇంట్లోకి రావా లనుకునేవారికి, ఇంటి వారి ఆహ్వానం, అనుమతి లభించిన తర్వాతనే ప్రవేశించే అవకాశం ఉంటుంది. గుడి అయితే ఏ ఒక్క వ్యక్తికో ఒక కుటుంబానికో పరిమితమైనది కాదు, కారాదు. గుడి దేశకాల, ప్రాంత, వయో, లింగ, వర్గ, వర్ణ భేదం లేకుండా అందరికీ సంబంధించినది. విశ్వాసం కల వారందరి హితానికి, క్షేమలాభాలకు, శ్రేయస్సు కొరకు నిర్మించబడినది. దేవాలయం అని పిలువబడే ఈ గుడి కొంతకాలానికి ఒకటి, రెండు తరాల వరకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. ఆలయం అంటే ప్రళయకాలం వరకు స్థిరంగా ఉండి తరతరాలకు చెందిన అసంఖ్యాక భక్తజనులకు ఆయురారోగ్యములను, సుఖసంతోషాలను, అషైశ్వర్యములను, క్షేమ లాభాలను అనుగ్రహించునట్టి పరమ పవిత్ర స్థానము.

ఈ ఆలయంలో ప్రధానంగా ప్రతిష్ఠింపబడిన పరమాత్మ, అమ్మవార్లు, గరుత్మంతుడు, ఆంజనేయుడు వంటి ఆళ్వార్లు, ఆచార్యులు అనే భక్తులు, చుట్టూ ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, కుబేర, ఈశానాది దేవతలు కూడా ఆరాధనలను అందుకుంటూ ఉంటారు. ఆలయంలో చేసే నమస్కారం ప్రధానమైన దైవంతోపాటు పరివార దేవతలకు కూడా చెందుతుంది. ఇటువంటి అవకాశం ఆగమశాస్త్ర ప్రకారం, దేవాలయవాస్తు ప్రకారం నిర్మాణం చేయబడిన దేవాలయంలోనే మనకు కలుగుతుంది. ఇళ్ళల్లో వారి వారి కుటుంబ సభ్యులు, అతిథులు, అహూతులు, బంధు మిత్రులు మాత్రమే కలిసి భోజనాదులను స్వీకరిస్తారు. గుడిలో చిన్న, పెద్ద, బీద, ధనిక, స్త్రీ, పురుష, భేదాలు లేకుండా భక్తులందరూ సహపంక్తిలో తీర్థ పుసాదాలను స్వీకరించే అవకాశం ఉంటుంది. గుడిలో భక్తులందరూ సమానమే కదా.

గుడిలో నిర్వహించే జపతపాలు, యజ్ఞ, యాగాదులు, భజనలు, పూజా పునస్కారాలు, అర్చనలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు, సంగీత, నృత్య, సాహిత్య, సమారాధనలు తాము ప్రత్యక్షంగా ఆస్వాదించడమే కాకుండా, ఇంటివారికి, బంధుమిత్రులకు తెలియజెప్పాలి. ఈ విశేషాలు అందరికీ శక్తిని, యుక్తిని, భక్తిని, పుష్టిని, తుష్టిని, ఆహ్లాదాన్ని, ప్రేరణను పంచుటకు కారణమౌతాయి. ఇళ్ళ సంభవించే కష్టనష్టాలు, వాదవివాదాలు, కోపతాపాలు, పగ ప్రతీకారాలు, రాగద్వేషాలు గుడి వరకు తీసుకురావద్దు.

గుడిలో భక్తిభావంతో, నిర్మల చిత్తంతో ఉండేవారికి భంగం కలిగించవద్దు. వారి ప్రశాంతతకు, భక్తిభావానికి భంగం కలిగించవద్దు. ఆరాధనలు, నైవేద్యాలు, ధ్యానం, ఆవాహన, షోడశోపచారాలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణాలు, పరమాత్మ సన్నిధిలో ఉదయం, సాయంత్రం భగవత్కథా శ్రవణం, నామ సంకీర్తనలు, భజనలు, సద్గ్రంథ పఠనం కొనసాగుతాయి. రాత్రివేళల్లో డోలోత్సవం, ఏకాంతసేవ జరుగుతుంటాయి. ఇళ్ళల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా సాధ్యం కాదు.

కొందరు విడివిడిగా చేసే పూజలకన్న అందరు కూడి చేసే ప్రార్థనలు, నామ సంకీర్తనలు శక్తి ఎక్కువ. “అందరు కూడి భజనలు చేయగా ఎందుకు రాడే మాధవుడు” అనే వాక్యం కూడా గుడి ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. “మద్భక్తా యత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద” అనే సూక్తి ప్రకారం శ్రీమహావిష్ణువు భక్తులు కూడి నామసంకీర్తన చేసే స్థలాల్లో స్థిరంగా ఉంటాను అని తెలిపాడు. ఇల్లు కన్న గుడి పదిలం అనే సత్యాన్ని గుర్తించి పరమ ప్రయోజనాన్ని పొందుదాం. మన జన్మలు సార్థకమయ్యే రీతిలో దేవాలయాల నుండి ప్రేరణ, శక్తి పొందుదాం ధన్యులమవుదాం.

– సముద్రాల శఠగోపాచార్యులు

Leave a Reply