———-
టన్నెల్‌లో స్పీడ్ పెరిగిన రెస్క్యూ
డి 1, డి 2 ప్రదేశాలలో అన్వేషణ
20 మీటర్ల దూరంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం
అమ్రాబాద్, ఆంధ్రప్రభ : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం ఒక వైపు రోబోలు.. మరో వైపు క్యాడివల్ డాగ్స్ లతో అన్వేషణకు రెస్క్యూ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇప్పటికే డాగ్స్ తో వెతుకులాట ప్రారంభం కాగా ప్రస్తుతం రోబోతో ట్రయల్ రన్ నిర్వహించారు. బహుశ సాయంత్రం నుంచి రోబోలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నాయి. మద్రాస్ ఐఐటీ కి చెందిన అన్వి రోబో బృందం సహాయక చర్యలలో భాగస్వాములయ్యారు. సొరంగాల్లో చిక్కుకుపోయిన మరో ఏడుగురు ఆచూకీ కోసం వివిధ రూపాలలో అన్వేషణ కొనసాగుతోంది.
20 మీటర్ల దూరం ప్రమాదకర పరిస్థితులు
సొరంగం లో ప్రమాదం జరిగిన చివరి ప్రదేశం అంటే 20 మీటర్ల దూరం పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, దీంతో ఆయా ప్రదేశంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. ముఖ్యంగా జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన డి 1 డి2 ప్రదేశాలలో తీవ్ర అన్వేషణ కొనసాగుతోంది. సొరంగంలోకి మొదటి షిఫ్ట్ లో కేడవర డాగ్స్, రోబో ల బృందం తోపాటు 110 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. ప్రతికూలంగా ఉన్న చివరి ప్రదేశంలో టీబీఎం భాగాలను రైల్వే సిబ్బంది తొలగిస్తుండగా రాడ్ హోల్ మైనర్స్ , సింగరేణి రెస్క్యూ టీమ్స్ తో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం?
సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలు వేగవంతం కావడం తో మంగళవారం సాయంత్రం గానీ, బుధవారం వరకు మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తీవ్ర ఆటంకంగా ఉన్న ప్రదేశంలోకి రోబోలా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో త్వరలోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. మనుషులు నడవలేని ప్రదేశంలోకి అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం బొగ్గు గనుల్లో దొంగలు ఇతర సామాగ్రిని వినియోగించి సహాయక చర్యలు చేపడుతున్నారు. అడ్డంకులను అధిగమించి త్వరలోనే మరిన్ని మృతదేహాలను వెలికి తీసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది