పీజీ కోర్సుల్లో 106 కొత్త సీట్లు..

పీజీ కోర్సుల్లో 106 కొత్త సీట్లు..

  • పాత ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో 46,
  • కొత్త కాలేజీల్లో 60 సీట్లు మంజూరు .
  • మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యలో సీట్లు భారీగా పెరిగాయి. గైనిక్, జనరల్ మెడిసిన్(Gynecology, General Medicine,), ఇతర స్పెషాల్టీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా 106 సీట్ల (బ్రాడ్ స్పెషాల్టీ కోర్సులు) భర్తీకి జాతీయ వైద్య కమిషన్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ఇందులో 5 వైద్య కళాశాలల్లో కొత్తగా వచ్చిన సీట్లు 60 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,763 బ్రాడ్ స్పెషాల్టీ, 4 డిప్లొమా కోర్సు సీట్లు ఉన్నాయి.

కిందటేడాది చివర్లో కూటమి ప్రభుత్వం పీజీ వైద్య విద్యలో అదనపు సీట్ల మంజూరుకు అనుమతి కోరుతూ నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్‌(ఎన్ఎంసి) కి కళాశాలల వారీగా దరఖాస్తు చేసింది. ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి తాజాగా వచ్చిన సమాచారంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి 106 సీట్లు కొత్త‌గా వ‌చ్చాయి. మొత్తమ్మీద జనరల్ మెడిసిన్(General Medicine) కోర్సులో 20, గైనిక్లో 20, పీడియాట్రిక్-26, ఎనస్థీషియా-12, రేడియాలజీలో 4, ఇతర విభాగాల్లో మరికొన్ని సీట్లు ఎన్ఎంసి మంజూరు చేసింది.

కూట‌మి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల‌కు పీజీ సీట్లు తొలిసారిగా వ‌చ్చాయి. మచిలీపట్నం కళాశాలలో 12, నంద్యాల-16, రాజమహేంద్రవరం-16, విజయనగరం-12, ఏలూరు వైద్య కళాశాలలో నాలుగు చొప్పున సీట్లు కొత్తగా ఎన్ఎంసి కేటాయించింది.

గుంటూరు మెడికల్ కళాశాలలో రేడియోలజీ 4, ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ 4, పీడియాట్రిక్ లో 4 చొప్పున సీట్లు వచ్చాయి. అనంతపురం వైద్య కళాశాలకు – 15, కడప – 7, కర్నూల్ -4, శ్రీకాకుళం(Srikakulam) కళాశాలకు 8 చొప్పున సీట్లు అదనంగా వచ్చాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కు కేంద్ర ప్ర‌భుత్వంతో ఉన్న‌ ప‌రిచ‌యాలు కూడా రాష్ట్రానికి అధిక సంఖ్య‌లో సీట్లు వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి

తిరుపతి స్విమ్స్ మరో 13 పీజీ వైద్య విద్య‌లో సీట్లకు ఎన్ఎంసీ(NMC) ఆమోదం తెలిపింది. ఎనస్తీషియా, ఈఎన్టీ, గైనిక్, ఆర్టో, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్ కోర్సుల్లో ఈ సీట్లు ఉన్నాయి.

Leave a Reply