అనారోగ్యంతో బెంగళూరులో కన్నుమూత
సెప్టెంబర్ 26న బందరు పరాసు పేటలో అంతిమ యాత్ర
( మచిలీపట్నం, ఆంధ్రప్రభ ప్రతినిధి) ఏపీ ఎన్జీవో సంఘం తూర్పు కృష్ణా మాజీ కార్యదర్శి, కృష్ణా జిల్లా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ యూనిట్ పూర్వాధ్యక్షులు, మహానటి సావిత్రి కళాపీఠం నిర్వాహకుడు, గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పదవీ విరమణ చేసిన దారపు శ్రీనివాస్ ఇక లేరు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరులో కుమార్తె స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బెంగళూరులో కుమార్తె వద్ద వైద్యం పొందుతున్నారు. ఆయనకు శ్రావణి, హరిణి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహానంతరం పెద్ద కుమార్తె శ్రావణి కుటుంబం ఉద్యోగరీత్యా బెంగళూరులో, చిన్న కుమార్తె హరిణి కుటుంబం కెనడాలో స్థిరపడ్డారు. దారపు శ్రీనివాస్ పార్థివదేహాన్ని శుక్రవారం ఉదయం 8 గంటలకు మచిలీపట్నం పరాసుపేటలోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర జరగనుందని పెద్ద కుమార్తె శ్రావణి, అల్లుడు అజయ్ తెలిపారు.