టీడీపీలో చేరిక..

ప‌ల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, సీనియ‌ర్ నాయ‌కుడు చిల‌క‌లూరిపేట‌ నేత మర్రి రాజ‌శేఖ‌ర్ టీడీపీలో చేరారు. గ‌త కొన్ని నెల‌ల‌ కింద‌ట మార్చి 19న‌ పార్టీకి గత శాసనసభ సమావేశాల చివరి రోజు వైసీపీకి, శాసన మండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

వైఎస్సార్ సీపీ అవిర్బావం నుంచి పార్టీలో కొన‌సాగుతూ పార్టీ క‌ష్టకాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహ‌రించారు. నాటి ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం పాటుప‌డిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పార్టీ మారుతున్నారంటే ముందుగా నమ్మలేదు.

అంత‌గా పార్టీ ప‌ట్ల నిబ‌ద్దత‌గా వ్యవ‌హ‌రించారు. పార్టీలోని కొంత‌మంది ఆయ‌న‌ను పొమ్మన‌లేక పోగ పెట్టారు అన్న చందంగా వ్యవ‌హ‌రించారు. అధినేత జ‌గ‌న్ కూడా జోక్యం చేసుకోక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీని వీడ‌టం అనివార్యమైంది. కాని వైసీపీలో ఆయ‌న ప‌డ్డ అవ‌మానాలు, స‌రైన ప్రాతినిధ్యం ఇవ్వక‌పోవ‌డం మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా వైసీపీ కి రాజశేఖర్‌ గుడ్‌బై చెప్పారు. ఆయన రాజీనామాను మండలి ఛైర్మన్‌ ఇంకా ఆమోదించలేదు.

అడుగ‌డుగునా అవ‌మానాలే

దివంగత మాజీ ఎమ్మెల్యే సోమేప‌ల్లి సాంబ‌య్య వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి ప్రవేశించిన మ‌ర్రిరాజ‌శేఖ‌ర్ …. పేద‌ల లాయ‌ర్‌గా పిలుచుకొనే వారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన ఇండిపెండింట్‌ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రిరాజశేఖర్, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఆయ‌న పాల‌న కాలంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గత రోడ్లు, లోలెవ‌ల్ చప్టాలు, ప‌సుమ‌ర్రు, న‌ర‌స‌రావుపేట‌, చిరుమామిళ్ల లాంటి పెద్ద బ్రిడ్జిలు వచ్చాయి.

ఆ త‌ర్వాత వైసీపీ ఆవిర్బావం త‌ర్వాత ఆ పార్టీలో చేరిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పార్టీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. కాని అనూహ్యంగా 2019 ఎన్నిక‌ల్లో ఎన్ఆర్ ఐ విడ‌ద‌ల ర‌జిని పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే టికెట్ కేటాయించారు. ఎన్నిక‌ల్లో ఆమెను గెలిపిస్తే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి మంత్రిని చేస్తాన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌భ‌లో హామీ ఇచ్చారు. మంత్రి ప‌ద‌వి మాట దేవుడెరుగు. ఐదేళ్ల కాలంలో విడ‌ద‌ల ర‌జినిని మంత్రిగా చేసి రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి సైతం వెనుకంజ వేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఏడాదిలో మ‌ర్రి కి కేవ‌లం ఎమ్మెల్సీ ప‌ద‌వితోనే స‌రిపెట్టారు. ఐదేళ్ల పాటు అధికారం ఉన్నా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం ప్రతిప‌క్షంలో క‌న్నా దారుణ‌మైన ప‌రిస్థితి అనుభ‌వించారు. అప్పట్లోనే ప‌లు మార్లు వివిధ పార్టీల అధినేతల‌ నుంచి త‌మ పార్టీలోకి రావాల‌ని ఆహ్వానం వచ్చినా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ నిరాక‌రించారు. కాని ప్రతి సంద‌ర్బంలోనూ ఎదురైన అవ‌మానాల‌తో చివ‌ర‌కు పార్టీని వీడారు.

అధినేత నిర్ణయాల‌తోనే ..

వైసీపీకి రాజీనామా చేస్తున్నా. మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరబోతున్నా అంటూ మార్చిలోనే ప్రకటించారు మర్రి రాజశేఖర్‌.. వైసీపీని వీడి నేను బయటకు రావడానికి పార్టీ అధినేత జగనే కారణం.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి జగన్‌ హయాంలో కనిపించలేదు. ఎంతో ఓర్పుగా ఉన్నప్పటికీ జగన్‌ విధానాలు, నిర్ణయాలు నచ్చక బయటకు రాక తప్ప లేదని వెల్లడించారు..

40 ఏళ్లుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది.. పార్టీని బలోపేతం చేసి, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినప్పటికీ నాకు ప్రాధాన్యం ఇవ్వలేదు.. అంతేకాదు, నాకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇస్తానని 2019లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో జగన్‌ ప్రకటించారు. 2024 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని నాకు తెలియకుండానే చేశారు. అంతా అయ్యాక నన్ను పిలిపించి పార్టీని గెలిపించమని కోరారు..

ఇలా ఆ పార్టీలో గౌరవం లేనప్పుడు ఎందుకు ఉండాలని రాజీనామా చేశాను.. నేను ఎమ్మెల్సీ పదవికి స్వచ్ఛందంగానే రాజీనామా చేశాను. అంటూ నాడు జ‌రిగిన విలేక‌ర్ల స‌మావేశంలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. రాజశేఖర్ రాజీనామాతో వైసీపీలో అసంతృప్తుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు రాజీనామా చేయగా.. వీరి బాటలోనే మర్రి రాజశేఖర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.

Leave a Reply