ఇడుపులపాయ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.. ఇక, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం తల్లి విజయమ్మను ప్రేమగా పలకరించారు జగన్.. ఈ సందర్భంగా జగన్ ను ఆశీర్వదించారు తల్లి విజయమ్మ. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలలో వైఎస్ కుటుంబ సభ్యులు.. ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీ నేతలు.. అభిమానులు ఇలా పెద్ద ఎత్తున తరలివచ్చారు..

షర్మిల సైతం ..
జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయ ఘాట్ కు చేరుకున్నారు . అనంతరం తండ్రి సమాధిపై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం పేరుతో జనం గుండెల్లో చెరగని సంతకం చేసిన మహానేత వైయస్ఆర్. నా ప్రతి అడుగులో నాన్న గారే నాకు మార్గదర్శి. నాన్న గారే నాకు స్ఫూర్తి అని అన్నారు. మహానేత వైయస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పించానని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు సీఎంగా పని చేసిన ఆయన.. రాష్ట్రంలోనే కాదు దేశంలోను కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలతో కోట్లాదిమంది గుండెలను తాకి.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, జలయజ్ఞం లాంటి పథకాలుతో పాలనలో వైయస్ఆర్ మార్క్ చూపించారని తెలిపారు. కాగా, వైయస్ఆర్ మరణానంతరం హైదరాబాద్ లో ఒక మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలిపోయిందని, . తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో వైయస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుకు రేవంతన్న సానుకూలంగా స్పందించాలని కోరారు..
ఆందోళన వద్దు.. అండగా ఉంటాం …

కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్ జగన్ ని ఇడుపులపాయ ఘాట్ వద్ద నేడు కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడం, ఎడిసెట్ విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్ జగన్ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. “విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది. వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.