యంగ్ ఇండియా రెఢీ..

- పోటీకి సై అంటున్న యువశక్తి…
టీ20 ప్రపంచ కప్ 2026 కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో మూడు నెలల్లో పొట్టి ప్రపంచ కప్ 10వ ఎడిషన్‌కు రంగం సిద్ధం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న భారత్ కు… ఇది ఓ కొత్త శకం. శ్రీలంకతో కలిసి ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత్.. కప్‌ను నిలబెట్టుకోవడంతో పాటు స్వదేశంలో తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2024లో అద్భుత విజయం సాధించిన భారత జట్టు, ఈసారి మరింత బలంగా బరిలోకి దిగేందుకు సిద్ధమౌతుంది. గత దశాబ్ద కాలంగా భారత వైట్‌బాల్ క్రికెట్‌ను శాసించిన ముగ్గురు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. వీరి రిటైర్మెంట్ తో ఓ అద్భుతమైన యుగం ముగిసినప్పటికీ, ఇప్పుడు యువ ఆటగాళ్లలో కొత్తతరం ఉరకలేస్తోంది.
2024 ప్రపంచ కప్ తర్వాత భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్, జట్టుపై తనదైన ముద్రను వేగంగా వేస్తున్నారు. 2024లో ఘన విజయం సాధించిన తరువాత కూడా భారత్ తన దూకుడు, ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వరుసగా నాలుగు బైలాటరల్ సిరీస్‌లు గెలవడంతో పాటు, ఆ తర్వాత ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. దీంతో టీమ్ ఇండియా కొత్త దిశలో దూకుడుగా ముందుకు సాగుతోందనేది స్పష్టంగా తెలుస్తోంది.
అయితే.. పొట్టి ప్రపంచ కప్ కు ఇంకా 3 నెలల సమయం ఉండగా, గంభీర్ దృష్టి సరైన కాంబినేషన్లను పరీక్షించడం పైనే ఉంది. యువ జట్టుగా ఉన్నప్పటికీ, గంభీర్ వ్యూహాత్మక దృష్టి, స్పష్టత, అలాగే స్వదేశ మైదానాల అనుకూలతతో భారత్ రాబోయే ప్రపంచ కప్ సవాలును విజయవంతంగా ఎదుర్కొనే అన్ని అవకాశాలు ఉన్నాయి.
2026 టీ20 ప్రపంచకప్ భారత్‌కు కేవలం మరో టైటిల్ కోసం పోరాటం కాకుండా… గౌతమ్ గంభీర్ సారథ్యంలో కొత్త తరం భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయాణం కానుంది. భారత జట్టులో యువశక్తి, అనుభవం కనిపిస్తోంది. ప్రస్తుతం 2026 ప్రపంచకప్‌లో ఈ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుత అవకాశం ఉంది.
టాప్ ఆర్డర్‌లో నిలకడకు మారుపేరైన శుభ్‌మన్ గిల్, దూకుడు గల అభిషేక్ శర్మ జోడీ భారత్‌కు శుభారంభం అందించనుంది. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ లతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ సిద్ధంగా ఉంది.
బౌలింగ్ విభాగంలో, ప్రపంచ శ్రేణి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతనికి తోడుగా, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌లతో పేస్ బలం పటిష్టంగా ఉంది. ఇక స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వైవిధ్యంగా నిర్వహిస్తారు. ఇక పాండ్యా, అక్షర్, శివం దూబే వంటి ఆల్ రౌండర్‌లు జట్టుకు మరింత బలాన్ని చేకూర్చనున్నారు.
అయితే, ఈ పొట్టి వరల్డ్ కప్‌కు దాదాపు మూడు నెలలు సమయం ఉండటంతో, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టు మరింత బలంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. రాబోయే సిరీస్‌లలో జట్టు వివిధ కాంబినేషన్లను పరీక్షించి, అత్యుత్తమ స్క్వాడ్‌ను ఖరారు చేయనుంది.
