- వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు..
- చిరుజల్లుల నడుమ యోగాతో తడిసి ముద్దయిన నదీ తీరం..
- మెగా ఈవెంట్‌కు భారీగా తరలివచ్చిన యోగా ప్రియులు…
- జిల్లా కలెక్టర్ లక్ష్మీశపై వెల్లువెత్తిన ప్రశంసలు..
- వినూత్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ఎన్‌టీఆర్ జిల్లా ముందుంటోందని అభినందనలు..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : బుధవారం తొలి జాము నుంచి చిరుజల్లులు సవ్వడి చేస్తూ కృష్ణా తీరం (Krishna coast) ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంది. నగరంలోని బెరం పార్కు (Beram Park) వద్ద కృష్ణమ్మ తీరం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ నేతృత్వంలో నిర్వహించిన వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు యోగా ప్రియులు విశేషంగా తరలిరావడంతో పులకించింది. ఉదయాన్నే బెరం పార్కుకు చేరుకున్న పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ-పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలకు యోగా ప్రియులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.
వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన యోగా ఔత్సాహికులు పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 201 వాటర్ క్రాఫ్టుల (Watercraft) పై వెయ్యి మంది, నదీ తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పచ్చని తివాచీలపై మరో వెయ్యి మంది యోగాసనాలు ఆచరించడంతో కృష్ణమ్మ ఒడి పులకించింది. ప్రపంచ రికార్డు సాధించాలన్న జిల్లా యంత్రాంగం ఆశయం నెరవేరింది.

యోగాసనాలను ఆద్యంతం నిశితంగా పరిశీలించిన వరల్డ్ రికార్డ్స్ (World Records) యూనియన్ న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్.. యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, యోగాసనాలను ఆచరించిన విధానం, తరలివచ్చిన ఔత్సాహికులను క్షుణ్నంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రపంచ రికార్డు సాధించినట్లు వేలాది మంది హర్షధ్వానాల మధ్య రికార్డు సాధించినట్లు ప్రకటించారు. ఓ నదిలో అత్యధిక మందితో వివిధ రకాల అత్యధిక బోట్లపై యోగాసనాలు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నట్లు ధ్రువీకరిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Sivanath) (చిన్ని), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ-పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంలకు సర్టిఫికెట్ అందించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ) సీఈవో తరుణ్ కాకాని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఆయుష్ అధికారులు డా. వి.రాణి, డా. రామత్లేహి, డా.రత్నప్రియదర్శిని, జిల్లా అధికారులు డా.ఎం.సుహాసిని, ఎ.శిల్ప, జి.జ్యోతి, డా. జె.సుమన్, పి.లావణ్య కుమారి, ఏఎన్‌వీ నాంచారరావు, ఎ.రాము, వి.పెద్దిబాబు, తహసీల్దార్లు ఇంతియాజ్ పాషా, రోహిణి దేవి, సుగుణ కుమారి, సూర్యారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు.
