బస్సు ప్రమాదం కేసులో ఎర్రిస్వామి సంచలన వ్యాఖ్యలు

బస్సు ప్రమాదం కేసులో ఎర్రిస్వామి సంచలన వ్యాఖ్యలు

కర్నూలు బ్యూరో, (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం 19 ప్రాణాలు బలి తీసుకున్న దుర్ఘటన పై దర్యాప్తు వేగం పెరిగింది. ఈ కేసును పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, కర్నూలు రూరల్‌ సీఐ చంద్రబాబునాయుడు, ఉల్లిందకొండ ఎస్‌ఐ ధనుంజయ పర్యవేక్షణలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదానికి ముందు జరిగిన సంఘటనల పై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల అదుపులో ఉన్న శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి మాట్లాడుతూ.. ఆ రాత్రి జరిగిన దుర్ఘటన గురించి పూర్తిగా వివరించాడు. తాను హైదరాబాద్ జిహెచ్ఎంసిలో చెత్త సేకరణ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్గా పని చేస్తున్నానని… తన మిత్రుడు కల్యాణ్ పెళ్లి కోసం పెద్దటేకూరుకు వచ్చిన రోజు (అక్టోబర్ 23) సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి వెళ్లాను. అయితే.. ఆ సమయంలో అమ్మ ఇంట్లో లేకపోవడంతో నా స్నేహితుడు శివశంకర్‌కు ఫోన్ చేశాను అన్నాడు.

అతను వెంటనే వచ్చి మద్యం తాగుదామని చెప్పాడు. ఇద్దరం పెద్దటేకూరులోని వైన్షాప్‌లో రెండు క్వార్టర్లు కొనుగోలు చేసి అక్కడే తాగాము. ఆ తర్వాత ఇంకొన్ని క్వార్టర్లు తీసుకుని తాగామని ఎర్రిస్వామి తెలియచేశాడు. అతను చెప్పిన సమాచారం ప్రకారం.. రాత్రి 10:30 ప్రాంతంలో అమ్మతో ఫోన్‌లో మాట్లాడుతూ రాంపల్లిలో పెళ్లికి వెళ్తానని చెప్పి, అర్థరాత్రి 2:15 గంటల సమయంలో శివశంకర్ నిద్రలేపాడని తెలిపాడు. డోన్లో వదిలేస్తానని పట్టుబడడంతో నేను వద్దు అన్నా వినలేదు. బైక్‌కు హెడ్లైట్ లేకపోయినా నాకు అలవాటే అంటూ బయలుదేరాడు. వర్షం మొదలైంది. కొంతదూరం వెళ్లాక శివశంకర్ డివైడర్కు ఢీకొట్టడంతో నేలపై పడిపోయాము. నేను పక్కకు వెళ్ళి లేచి చూసేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పాడు.

ఎర్రిస్వామి చెప్పిన సమాచారం ప్రకారం.. పడిపోయిన కొద్ది సేపటికే పసుపు రంగు వీ. కావేరి బస్సు అతివేగంగా వచ్చి రోడ్డుమధ్యలో ఉన్న మా పల్సర్ బైక్‌ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ బస్సు ఆపి మంటలు ఆర్పుతున్నాడు. భయంతో అక్కడి నుంచి పారిపోయాను. బస్సులో మంటలు చెలరేగడంతో లోపలున్నవారిని కాపాడలేకపోయాను అని విచారంగా తెలిపాడు. తన వల్ల ప్రమాదం జరగలేదని, పోలీసులకు జరిగినదంతా వివరించానని ఎర్రిస్వామి స్పష్టం చేశాడు. నేను ఏ తప్పు చేయలేదని ,చేసి ఉంటే పారిపోకుండా ఇక్కడే ఎందుకు ఉంటాను.. ఇది బ్యాడ్ టైం మాత్రమే, అని బాధతో తెలిపాడు.

ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం తగ్గడం వంటి అంశాల పై సాంకేతిక విశ్లేషణ కొనసాగుతోంది. ఘటన జరిగిన ప్రదేశం వద్ద నుంచి సీసీ కెమెరా ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. జిల్లా పోలీసు అధికారులు ఈ దుర్ఘటన పై పూర్తి నిజాలు వెలికి తీసే దిశగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇప్పటికే డ్రైవర్ అరెస్ట్..
నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనల పై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ నెల 24న బైక్‌ను ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు పై సెక్షన్‌ 12(ఏ), 106(1) బీఎన్‌ఎస్‌ కింద కేసు నమోదు చేశారు. ఏ1గా వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్ తో పాటు ఏ2గా బస్సు యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. అయితే.. పోలీసుల విచారణలో రెండూ వేర్వేరు ఘటనలని తేలాక ఈ నెల 25న మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతి చెందిన బైకర్‌ శివశంకర్‌ పై సెక్షన్‌ 281, 125(ఏ), 106(1) కింద కేసు నమోదు చేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

Leave a Reply