AP | ఉచిత బస్సు హామీపై వైసీపీ విలక్షణ నిరసన

అరెస్టు చేసిన పోలీసులు 


తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం హామీని అమలు చేయకపోవడం పై తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం విలక్షణమైన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం తిరుపతి ఇన్ ఛార్జ్ భూమన అభినయ రెడ్డి, నగర మేయర్ శిరీషల నేతృత్వంలో పలువురు మహిళలు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్నారు. అక్కడ తిరుపతి నుంచి పీలేరు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఎక్కారు. బస్సు స్టాండ్ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం వెళ్తుండగా బస్సు కండక్టర్ దామోదర్ ఇతర ప్రయాణీకులతో పాటు వారిని కూడా టికెట్లు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన  మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం  హామీ మేరకు తాము టిక్కెట్లు తీసుకోబోమని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా శ్రేణులు పట్టు పట్టారు.

తమకు పై నుంచి ఉత్తర్వులు వస్తే కానీ తాము ఏమీ చేయలేమని, టికెట్ తీసుకోకుంటే దిగిపోవాలని కండక్టర్ స్పష్టం చేశారు. బస్సులో టికెట్ అడిగితే తన పేరు చెప్పాలని చంద్రబాబు చెప్పిన మాటల వీడియోలను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ప్రదర్శిస్తూ తాము టిక్కెట్లకు డబ్బులు ఇవ్వబోమని నిరసన తెలిపారు. బస్సును ఆపివేసి కండక్టర్ తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని సమీపంలోని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులతో కూడా అదే వాదన చేయడానికి యత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మహిళలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈసందర్భంగా అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఉచిత బస్సు హామీ బూటకమని నిరూపించి, చిత్తశుద్ధి ఉంటే ఆ హామీని తక్షణమే అమలు చేయాలనే డిమాండ్ తో తాము ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈసందర్భంగా 35మంది పై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *