- టేబుల్ టాపర్ గా ఢిల్లీ క్యాపిటల్స్
- ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో
మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. గుజరాత్ జేయింట్స్తో జరిగిన ఈ మ్యాచ్ లో 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ… 15.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జేయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. టాపార్డర్ పూర్తిగా విఫలమైన వేళ.. భారతీ ఫుల్మాలి (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు, 40 నాటౌట్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. బెత్ మూనీ (10), తనూజా కన్వర్ (16), డియాండ్రా డాటిన్ (26) పరుగులు చేయగా.. మిగిలిన వారు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు.
ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మారిజానే కప్ప్, అన్నాబెల్ సదర్లాండ్ రెండేసి వికెట్లు తీయగా.. టిటాస్ సాధు, జెస్ జోనాస్సెన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం, 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్… గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు 44), జెస్ జోనాసెన్ (32 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు 61 నాటౌట్) చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కేవలం 37 బంతుల్లో 74 పరుగులు జోడించారు.
కెప్టెన్ మెగ్ లానింగ్ (3), జెమీమా రోడ్రిగ్స్ (5), అన్నాబెల్ సదర్లాండ్ (1), మరిజానే కాప్ (9 నాటౌట్) సింగిల్ డిజిట్ పరుగులు చేసినప్పటికీ…. షఫాలీ వర్మ, జెస్ జోనాసెన్ విజృంభించడంతో ఢిల్లీ జట్టు సులువైన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు 6 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది. మరోవైపు నాలుగు మ్యాచ్లు ఆడి ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసిన గుజరాత్ చివరి స్థానంలో ఉంది.