Worker to Owner | కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి..

Worker to Owner | కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి..
- సంక్రాంతిలోపు వర్కర్ టు ఓనర్ ఇవ్వాలి..
- పథకం అమలు కాకుంటే 10 వేల మందితో మహా ధర్నా
- బతుకమ్మ చీరలిచ్చిన ఏకైక ప్రభుత్వం మాదే..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Worker to Owner | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగలోపు వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించాల్సిందేనని, లేకుంటే పదివేల మందితో సిరిసిల్లలో మహా ధర్నా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్ అపెరల్ పార్కును(Apparel Park) సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… వర్కర్ టు ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ, పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు.
ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని, సంక్రాంతి లోపలే వర్కర్ టు ఓనర్(Worker to Owner) పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఈ పథకం సమర్థవంతంగా అమలు కావాలంటే, గతంలో రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పవర్ లూమ్లను సబ్సిడీపై కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్లో పూర్తిస్థాయిలో కేటాయించాలన్నారు.
అలాగే సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన(Eligible) నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలని కోరారు. ఒకవేళ సంక్రాంతి లోపల ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ, నేత కార్మికులందరినీ సమీకరించి ఆందోళనకు దిగుతామన్నారు.

దాదాపు 10,000 మంది నేతన్నలతో సిరిసిల్ల పట్టణం మొత్తం కదిలే స్థాయిలో ఉద్యమం ఉంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, నేతన్నల జీవితాలను కాపాడేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దూరదృష్టి, మానవీయత, రాజకీయ సంకల్పం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న 2005లోనే సిరిసిల్ల నేతన్నల దుస్థితిని, వస్త్ర పరిశ్రమలో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని గుర్తించి స్పందించిన నాయకుడని గుర్తు చేశారు.
ఒక్క వారం వ్యవధిలో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో చలించిపోయిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వాని(State Government)కి పోయి రావాలనే ఉద్దేశంతో పార్టీ తరఫున 50 లక్షల రూపాయలను సిరిసిల్ల పద్మశాలి సమాజానికి అందజేసి, నేతన్నలను ఆదుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. వస్త్ర పరిశ్రమను, ముఖ్యంగా సిరిసిల్ల నేత కార్మికులను కంటికి రెప్పలా కాపాడిన నాయకత్వం కేసీఆరేనన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 3,400 కోట్ల రూపాయల విలు వైన బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించి నేతన్నల బతుకులను మార్చడమే కాకుండా తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ కానుకగా చీరలు అందించిన గొప్ప ఆలోచన కూడా కేసీఆర్ నన్నారు. ఏడాదికి కోటి మంది మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కార్మికుల ఆదాయం 15-20 వేల రూపాయలకు పెరగాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారని వివరించారు.
ఈ చర్యలతో సిరిసిల్ల దశ తిరిగిందని, నేతన్నలకు స్థిరమైన ఆదాయం లభించిందన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్న మూడంచెల వ్యవస్థను అధ్యయనం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారని, కార్మికులు, ఆసాములు, సేట్లు అనే వ్యవస్థలో కార్మికుడు కార్మికుడిగానే మిగిలి పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ, కార్మికుడిని ఆసామిగా మార్చే విప్లవాత్మక(Revolutionary) ఆలోచనతో వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
ఇది దేశంలోనే కాక బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని వినూత్న పథకమన్నారు. బీడీలు చుడుతూ ఆరోగ్యాన్ని కోల్పోతున్న మహిళలకు మంచి వాతావరణంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపెరల్ పార్కును, దానికి అనుసంధానంగా వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని రూ.400 కోట్ల(Rs.400 Crore)తో కేసీఆర్ ప్రారంభించారన్నారు. దాదాపు 50 షెడ్ల నిర్మాణాలు రెండేళ్ల కిందటే పూర్తయ్యాయని, పవర్ లూమ్లను సబ్సిడీపై అందించి కార్మికులనే యజమానులుగా మార్చాలనే అద్భుత ఆలోచన ఉందని తెలిపారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. షెడ్లన్నీ నిరుపయోగంగా మారి, పిచ్చి చెట్లు మొలిచి, కనీస నిర్వహణ కూడా లేకుండా అధ్వాన స్థితిలో ఉన్నాయని, కొన్నిచోట్ల వాటిని వడ్ల నిల్వలకు ఉపయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని ఆరోపించింది.
ఇది 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసే ప్రయత్నమే అని మండిపడ్డారు. కేసీఆర్ ఆలోచన ప్రకారం నేత కార్మికులు(Workers) ఆసాములుగా, వర్కర్ ఓనర్లుగా మారాలని, సిరిసిల్ల ఒక తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల రూపాయల వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలని బీఆర్ఎస్ ఆకాంక్ష అన్నారు. కేసీఆర్ హయాంలో అపెరల్ పార్కులో గ్రీన్ నీడిల్, టెక్స్పోర్ట్ అనే రెండు పరిశ్రమలను తీసుకువచ్చామని, వాటిలో తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్క ఎగుమతి అవుతున్నాయని, దాదాపు 2,000 మంది మహిళలకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. సంక్రాంతిలోపు చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు.
