కార్నివాల్ కు అద్భుత ఏర్పాట్లు

కార్నివాల్ కు అద్భుత ఏర్పాట్లు
- 3 వేల మంది కళాకారుల విన్యాసం
- 28న సీఎం.. డిప్యూటీ సీఎం రాక
- గిన్నీస్ రికార్డుకు సన్నద్ధం
- ఏర్పాట్లపై ఎంపీ శివనాథ్ సమీక్ష
( ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ) : దసరా ఉత్సవాలకు ప్రతీకగా నిలుస్తున్న విజయవాడలో ఈసారి కొత్త చరిత్ర రాయడానికి అద్భుత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దసరా వైభవాన్ని పరిచయం చేస్తూ గిన్నిస్ బుక్ రికార్డుల సాధన లక్ష్యంగా ఈనెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav ) లో భాగంగా భారీ దసరా కార్నివాల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. ఈ కార్నివాల్ ఏర్పాట్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Shivnath) శుక్రవారం సమీక్షించారు.
బందరు రోడ్డులో దసరా సందడి..
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (Indira Gandhi Municipal Stadium) నుంచి బెంజి సర్కిల్ వరకు బందరు రోడ్డంతా కార్నివాల్‌కు వేదిక కానుంది. సుమారు 3 వేల మంది దసరా వేషధారణ కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో, రంగురంగుల వేషాలతో ప్రజలను ఆకట్టుకోనున్నారు. దసరా సందర్భంలో దుర్గమ్మ వైభవాన్ని ప్రతిబింబించేలా సాంప్రదాయ, జానపద, సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శించనున్నారు.
ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా తయారు చేయించిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాం ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Shivnath) తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా బందరు రోడ్డులోని డి అడ్రస్ మాల్ ఎదుట ఏర్పాటు చేస్తున్న సభా వేదిక స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ముఖ్య అతిథులకు భద్రత టార్గెట్…
కార్నివాల్‌కు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) హాజరవుతుండటంతో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉండటంతో రహదారి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్లు, ప్రత్యేక సదుపాయాలు సిద్ధం చేయాలని ఎంపీ సూచించారు. ముఖ్యంగా ముఖ్య అతిథుల పర్యటనలో ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ప్రజలకు అన్ని సౌకర్యాలు..
కార్నివాల్‌లో పాల్గొనబోయే కళాకారులు, ప్రేక్షకుల కోసం నీటి సదుపాయం, వైద్య శిబిరాలు, పార్కింగ్, శానిటేషన్ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఎంపీ సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని మోహరించాలని కోరారు.
విశ్వవ్యాప్తంగా బెజవాడ ప్రతిధ్వని…
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ..“విజయవాడ దసరా ఉత్సవాలు కేవలం నగర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా ఈ కార్నివాల్ (Carnival) వేదిక కానుంది. 3 వేలమంది కళాకారులతో జరిగే ఈ అద్భుత ప్రదర్శన ద్వారా గిన్నిస్ బుక్ రికార్డులో కొత్త చరిత్ర సృష్టించనున్నాం. విజయవాడ దసరా ఉత్సవాలు భవిష్యత్తులో మరింత విశిష్టంగా నిలుస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పాలచూరి నాగేశ్వరరావులతోపాటు తదితరులు పాల్గొన్నారు.
కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణలు..
సెప్టెంబర్ 28న సాయంత్రం 5 గంటల నుంచి 7.30 వరకు కార్నివాల్ జరగనుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా పాల్గొననున్నారు. ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. 28న జరిగే ఈ దసరా కార్నివాల్ విజయవాడ ప్రజలకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణం కానుంది.

