Women | ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

Women | ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
Women | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సమాజంలో అణచివేతకు గురవుతున్న మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ఆ కాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా భావించే పరిస్థితుల్లో, ఎన్నో అవమానాలను భరించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించారని గుర్తుచేశారు. జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ, బాల్య వివాహాల నిర్మూలనకు, వితంతు పునర్వివాహాలకు ఆమె అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.
సావిత్రిబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆమె మార్గంలో నడవడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు మండలి రామమోహనరావు, పర్చూరి దుర్గాప్రసాద్ , బండే రాఘవ, కొల్లూరి ఇమ్మానియేలు, దాసినేని శ్రీనివాసరావు, మెగవత్తు గోపి, కంచర్ల ఆనంద్, గుడివాక పద్మాయి, చెన్ను బాబూరావు, అడపా శ్రీను, ముళ్ళపూడి శ్రీనివాసరావు, నాగిడి రాంబాబు, కొండవీటి గోవిందు, ఇమ్రాన్ జటావత్తు శ్రీను, మట్టా విజయ ప్రసాద్, గాలం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
