రెండుసార్లు ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ లో మిగిలిన అన్ని BWF టూర్ ఈవెంట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. యూరోపియన్ లెగ్‌కు ముందు తగిలిన కాలి గాయం పూర్తిగా నయం కాలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
ఈ సందర్భంగా ఎక్స్ వేధికగా పోస్ట్ చేస్తూ.. తన సపోర్ట్ టీమ్, ప్రముఖ క్రీడా ఆర్థోపెడిస్ట్ డాక్టర్ దిన్‌షా పర్దివాలాతో సహా వైద్య నిపుణులను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింధు తెలిపింది.
“యూరోపియన్ లెగ్‌కు ముందు నాకు తగిలిన కాలి గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదు. దీనిని అంగీకరించడం ఎప్పుడూ సులభం కాదు, కానీ గాయాలు ప్రతి క్రీడాకారుడి ప్రయాణంలో అంతర్భాగం. అవి మన స్థైర్యాన్ని, సహనాన్ని పరీక్షిస్తాయి, కానీ బలంగా తిరిగి రావడానికి ప్రేరణను కూడా ఇస్తాయి,” అని సింధు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ వేన్ లోంబార్డ్ పర్యవేక్షణలో తన పునరావాసం, శిక్షణ ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో తొందరగా నిష్క్రమించిన సింధూకు… 2025 సీజన్ కూడా సవాలుగా మారింది. ఈ సీజన్‌లో అనేక టోర్నీల్లో మొదటి లేదా రెండవ రౌండ్ నుంచే నిష్క్రమించిన సింధు, BWF టూర్‌లో రాణించలేకపోయింది.
అయితే ఇండియా ఓపెన్ సూపర్ 750, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరడం ఆమెకు ఈ ఏడాది ఉత్తమ ఫలితాలుగా నిలిచాయి.
ఇక, గత సీజన్‌లో మలేషియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు, చివరిసారిగా డిసెంబర్‌లో జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె టైటిల్ కోసం నిరంతర పోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు, కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మరింత శక్తివంతంగా తిరిగి బరిలోకి దిగుతుందని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

