నిజామాబాద్ ప్రతినిధి, మార్చి18 (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 9 నెలల తర్వాత ఆలస్యంగా నేడు డైట్ టెండర్లను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్) లో ఎన్నో రోజులుగాఎదురుచూస్తున్న డైట్ టెండర్లను వారిష్టానుసారంగా, వ్యవహరిస్తూ టెండర్ దారులకు పూర్తి సమాచారం తెలియకుండానే నేడు (మంగళవారం మధ్యా హ్నం) ఫైనలైజేషన్ చేయడానికి సిద్ధం చేశారు. మరి ఎందుకు ఇంత ఆలస్యం ఏం జరిగింది..? ఈ టెండర్లను ఫైనలైజ్ చేయడానికి ఎందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అనే ప్రశ్న జిల్లాలో చర్చనీయాంశమవుతుంది.
ఈ డైట్ టెండర్లు గత సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లోనే పూర్తి కావలసి ఉండగా ఇవాళ పూర్తి చేయడం వెనకాల అసలు ఆంతర్యం ఏమిటి ? ఇందుకు ప్రధాన కారణం ఏమిటి ? జీజీహేచ్ లో డైట్ డర్లు 2024 జులై 12న ప్రారంభం కాగా.. ఆగస్టు నెలలో 22న స్క్రూట్నీని చేయడానికి నిజామాబాద్ జీజీహెచ్ నుంచి బదిలీ అయిన ఏడీ… జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే టెండర్ల కార్యక్రమంలో పాల్గొనడం కొసమెరుపు. 9నెలల తర్వాత నేడు (మంగళవారం) ఫైనలైజేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. అసలు దీని వెనకాల ఏం జరుగుతుందనేది ప్రశ్నగా మారింది.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టెండర్ దారుడికి కోట్ల రూపాయల బిల్లు చెల్లింపు..
వాస్తవానికి ఇతరుల పేరు మీద టెండర్ దక్కించుకొని డైట్ టెండర్ వ్యవహారం నడిపిస్తున్నాడని, గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఇటీవల సుమారు 8నెలలకు సంబంధించి కోట్ల రూపాయల నిధుల చెల్లింపు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డైట్ టెండర్ల ప్రక్రియ నుంచి అన్ని విషయాల్లో అన్ని తానే వ్యవహరిస్తూ గోల్ మాల్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల అండదండలతో తాను అనుకున్నది సాధిస్తున్నాడు.
నాణ్యమైన భోజనం అందించడంలేదని పలు సందర్భాల్లో ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయనకు చెక్కు చెల్లింపు చేయడంపై ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా అసలు టెండర్ దారుడు కాదని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు తెలిపినా ఆయనకు చెక్కును ఏ విధంగా చెల్లింపు చేశారనేది ప్రశ్నగా మారింది. ఆరోపణలున్న వ్యక్తికి బిల్లు ఏ విధంగా చెల్లింపు చేశారని జిల్లా అధికారులను జిల్లా పరిషత్ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. నేడు జరిగే డైట్ టెండర్లలో కూడా అతనికే టెండర్ దక్కేలా అన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఎట్టకేలకు అతనికే టెండర్ దక్కుతుందా..? చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
