వితంతువు దుర్మరణం
- కర్నూలు జిల్లాలో విషాదం
(కోసిగి. ఆంధ్రప్రభ) : తెల్లారితే దసరా పండుగ. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో ఈ సారి హాయిగా .. ఊళ్లో బంధువులతో సంతోషంగా గడపొచ్చని.. తన కుమారుడితో కలిసి పెన్షన్ (Pension) డబ్బుల కోసం బయలుదేరిన ఓ వితంతువును ఆటో రూపంలో మృత్యువు కాటేసింది. ఆమె బిడ్డను అనాథగా మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కర్నూలు (Kurnool) జిల్లా కొసిగి మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. కోసిగి ఆరవ వార్డు కు చెందిన పెండెకంటి ఈ రన్న, ఈరమ్మ దంపతుల కుమార్తె అయిన లక్ష్మీ ని గతంలో మండల పరిధిలోని కందుకూరు (Kandukuru) గ్రామానికి చెందిన రామూర్తికి ఇచ్చి వివాహం చేశారు. విధి చిన్న చూపు చూడడంతో 13 ఏళ్ల కిందటే భర్త చనిపోయాడు. తనకు మిగిలిన ఒక్కగాని ఒక్క కొడుకుతో పుట్టినింటికి చేరింది. ఇక్కడే తల్లిదండ్రుల నీడలో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త చనిపోవటంతో ప్రతినెల ఒకటవ తేదీనా ప్రభుత్వం ఇస్తున్న వితంతువు పెన్షన్ తీసుకోడానికి భర్త ఊరు కందుకూరు కు కొడుకు చరణ్ తో కలసి బైక్ పై బయలుదేరింది.
ఉరుకుంద ఆర్చీ (Urukunda Archie) సమీపంలో చేరే సరికి హల్వి రోడ్డులో ఆటో ఢీకొంది. బైక్ నడుపుతున్న కుమారుడు చరణ్ కు స్వల్ప గాయాలు కాగా వెనుక వైపు కూర్చున్న లక్ష్మి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను కోసిగి లో ప్రథమ చికిత్స చేయించి, ఆదోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గతంలో తండ్రి రామూర్తిని ఇప్పుడు తల్లి లక్ష్మి మృతి చెందడంతో కుమారుడు చరణ్ అనాథగా మారాడు. దసరా పండుగ వేళ.. ఈ దుర్వార్త తెలిసి లక్ష్మీ బంధువులు పెద్ద సంఖ్యలో ఆదోని ఆసుపత్రికి చేరుకుని దుఃఖ సాగరంలో మునిగిపోయారు.