హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు ?

హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు ?

ఊరుకొండ, ఆంధ్రప్రభ : నేడే హనుమాన్ జయంతి జరగనుంది. చైత్రపక్ష పౌర్ణమి అనగా గురువారం ఈరోజు ఈ శివుని రుద్ర అవతారమైన హనుమంతుడి జయంతి నిర్వహిస్తారని ఊరుకొండ పేట శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు సిరివెల్లి దత్తాత్రేయ శర్మ అన్నారు. ఏప్రిల్ 2వ తేదీ గురువారం (నేడు) హనుమాన్ జయంతి నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 1 బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 2 గురువారం ఉదయం 7:41 గంటల వరకు ఈ చైత్ర పౌర్ణమి తిథి ఉంది. అయితే ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జయంతి ఏప్రిల్ 2వ తేదీన నిర్వహిస్తున్నారు. హనుమంతుని చిరంజీవిగా పరిగణిస్తారు. ఆయన ఇప్పటికీ భూమి పైనే చిరంజీవిగా ఉన్నారని నమ్మకం. అంతే కాదు ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా.. రాముడు భక్తుడిగానే ఉన్నారు. హనుమంతుడు శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు.

హిందూ పురాణాల ప్రకారం సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్న వాళ్లు సంకటమోచన హనుమంతుని పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే.. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి రెండు సార్లు జరుపుకుంటారు. మొదటి హనుమాన్ జయంతి హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తారు. రెండోసారి హనుమాన్‌ జయంతి విజయ అభినందన మహోత్సవంగా సంకటమోచన హనుమంతుడు పుట్టిన రోజు చతుర్దశ తిథి కృష్ణపక్షం కార్తీక మాసంలో నిర్వహిస్తారు. దీనికి కొన్ని పురాణాలు ముడిపడి ఉన్నాయి. హనుమంతుడు అసాధారణ శక్తితో పుడతాడు. అయితే.. అతనికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్యుని చూసి పండుగ భావించి తినాలని దగ్గరికి వెళ్తాడు. దీని వల్ల ప్రపంచమంతా చీకటితో నిండిపోతుంది. ఇక ఇంద్రుడు.. హనుమంతుడు సూర్యుని మింగకుండా నిరోధించడానికి వజ్రాయుధంతో అతని పై దాడి చేస్తాడు.

దీంతో హనుమంతుని తండ్రి పవన దేవుడు ఆగ్రహానికి గురై విశ్వంలో గాలిని నిలిపివేస్తాడు. ఇక వెంటనే బ్రహ్మదేవుడు జోక్యం చేసుకొని శాంతింపజేసి మళ్లీ హనుమంతునికి ప్రాణం పోస్తాడు. అలా చైత్రమాసం పౌర్ణమి తిథిన హనుమంతుడికి పునర్జన్మ లభించింది అని నమ్ముతారు. అదే హనుమాన్ జయంతిగా జరుపుతారు. ఊరుకొండ పేటలోని మా గృహం నుండి ఆంజనేయస్వామి వారి జన్మదినం సందర్భంగా స్వామి వారి ప్రతిమను వాహనంపై పురవీధుల గుండా ఊరేగింపుగా అశేష జనవాహిని భక్తుల మధ్య భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో జైశ్రీరామ్ జై హనుమాన్ అనే నామస్మరణతో స్వామి వారి ప్రతిమతో దేవాలయమునకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఊరుకొండ పేట శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు సిరివెల్లి దత్తాత్రేయ శర్మ తెలియచేశారు.

Leave a Reply