New Vice President | కొత్త ఉపరాష్ట్రపతిపై చ‌ర్చోపచ‌ర్చ‌లు..

ఎవరు?

ధ‌న్‌ఖ‌డ్ ఎపిసోడ్ ఇక‌ ప‌రిస‌మాప్తం
60 రోజుల్లో మ‌ళ్లీ ఎన్నిక జ‌ర‌గాలి
రాజ్యంగా ప‌ద‌వికి మొద‌లైన పోటీ
ఎన్డీఏ కూట‌మిలో అర్హులపై ఆరాలు
బీహార్ ఎన్నిక‌ల కోణంలోనూ వ్యూహాలు
సామాజిక వ‌ర్గీక‌ర‌ణ అంశంలోనూ స‌మీక‌ర‌ణ‌లు
ఎన్నిక‌లో మిత్ర‌ప‌క్షాల పాత్ర కీల‌కం
జేడీయూ, టీడీపీ, శివ‌క‌సేన‌ల స‌పోర్టు ఉండాల్సిందే
ప్ర‌ధానంగా వినిపిస్తున్న రామ్‌నాథ్ ఠాకూర్ పేరు
ప‌రిశీల‌న రేసులో ముందున్న నితీష్‌కుమార్‌
బీజేపీ నుంచి ప‌లువురి పేర్ల ప‌రిశీల‌న‌
కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు చాన్స్ ఉండేనా?
ప్ర‌ధాన విప‌క్షాన్ని ఇరుకున‌పెట్టేందుకు అస్త్రంగా వాడుకోవ‌చ్చా
పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ‌లు, అంత‌ర్మ‌థ‌నం

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా తర్వాత దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి పోటీ ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కానీ, నిజమైన రాజకీయాలు ఇప్పుడే ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం.. ధన్‌ఖడ్ రాజీనామా తర్వాత 60 రోజుల్లోపు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పనిసరిగా జరగాలి. అయితే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రానున్నందున ఈ ఎన్నికను రాజ్యాంగ ప్రక్రియగా మాత్రమే కాకుండా బీహార్ ఎన్నికల వ్యూహం కోణం నుంచి కూడా చూస్తున్నారు. గత దశాబ్దంలో బీజేపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన రాజ్యాంగ పదవులకు నియామకాలు చేసింది. అయితే.. ఇప్పుడు ఈ అవకాశం కూడా అందుకు మినహాయింపుగా అనిపించడం లేదు.

మిత్రపక్షాల పాత్ర కీలకం

లోక్‌సభ , రాజ్యసభలోని మొత్తం 782 మంది ప్రభావవంతమైన సభ్యులలో విజయం కోసం 394 ఓట్లు అవసరం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ప్రస్తుతం లోక్‌సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 129 మంది ఎంపీల మద్దతు ఉంది. అంటే.. లెక్కల ప్రకారం ఎన్‌డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ ఇందులో మిత్రపార్టీల‌ పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుంది. జేడీయూ, టీడీపీ, శివసేన వంటి పార్టీల మద్దతును కొనసాగించడం అవసరం.

ఉపరాష్ట్రపతి పదవికి ఎవరి పేరు చర్చలో ఉంది?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని నిలబెడితే బాగుంటుంది అనే చర్చ మొదలైంది. ఇక.. రేసులో ఉన్న పేర్లతో ఓ లిస్టు కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉండటంతో పాటు జేడీయూ నుంచి ఎంపీగా ఉన్న వ్య‌క్తి పేరు ప్ర‌ధానంగా చ‌ర్చ‌ల్లోకి వ‌స్తోంది. ప్రధాని మోదీకి న‌మ్మ‌క‌స్తుడిగా కర్పురి ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ ఉన్నారు. ఈయనకు రాజ్యసభ నిర్వహణలో కూడా అనుభవం ఉంది. ప్రధానంగా ఆయన పేరు మొదటగా వినిపిస్తోంది. కానీ, ఆయన తండ్రి ఇటీవల భారతరత్న అందుకున్నారు. కాబట్టి బీజేపీ ఒకే కుటుంబాన్ని మళ్లీ మళ్లీ ప్రోత్సహించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక‌.. ఎన్‌డీఏకు కీల‌క భాగ‌స్వామిగా ఉన్న బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ పేరు కూడా చర్చలో ఉంది. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి , స్వభావం ఉపరాష్ట్రపతి బాధ్యతలకు తగినవిగా ఉండ‌బోవ‌న్న‌ది కూడా పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

బీజేపీ నుంచి ఎవరికి చాన్స్ ఉండొచ్చు..

బీజేపీ అంతర్గత రాజకీయాల్లో, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, మనోజ్ సిన్హా, వసుంధర రాజే వంటి పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. కానీ, ఈ పేర్లు ఏవీ అన్ని రాజకీయ సమీకరణాలను సమతుల్యం చేయలేకపోతున్నాయి. నడ్డా పదవీకాలం మార్చి 2025లో ముగుస్తుంది. షా-మోడీతో ఆయన సాన్నిహిత్యం అతన్ని బలమైన పోటీదారుగా నిల‌బెడుతున్న‌ప్పిటీకి.. ఆయ‌న అంత స‌మ‌ర్థుడేనా అన్న చ‌ర్చ కూడా జ‌రుగోతంది. మనోజ్ సిన్హా పేరు కూడా విన‌ప‌డుతోంది. కానీ, కుల సమీకరణాలు ఆయనకు అనుకూలంగా లేవన్న‌ది ప‌రిశీల‌కుల భావ‌న‌..

ప్రతిపక్షాలకు చాలా తక్కువ చాన్స్‌..

ప్రతిపక్ష ఇండియా కూటమికి 150 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వారి ఆశలు చాలా తక్కువ. అయితే కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్న శశి థరూర్ పేరు అంద‌రికీ ఆయోద్య‌యెగ్యం అనేది తెలుస్తోంది. బీజేపీ థరూర్ లాంటి ముఖాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్‌ను ఇంట‌ర్న‌ల్‌గా విచ్ఛిన్నం చేయాలని కోరుకోవచ్చు. కానీ, రాజకీయ విశ్వసనీయత , పార్టీ నియంత్రణ దృక్కోణం నుంచి ఈ అవకాశం చాలా అసంభవమ‌నేది ప‌రిశీల‌కులు అభిప్రాయం. చూడాలి మరి.. ఎవర్ని ఈ అత్యున్నత పదవి వరిస్తుందో.

Leave a Reply