అక్రమ తరలింపు.. చేసింది ఎవరు..?

అక్రమ తరలింపు.. చేసింది ఎవరు..?

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల చెరువు నుండి గుర్తు తెలియని వ్యక్తులు గత మూడు రోజులుగా రాత్రి సమయంలో అక్రమంగా చెరువు మట్టిని పెద్దవంగర శివారులోని ఇటుక బట్టికి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా తరలిస్తున్నారని పోచంపల్లి గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీని పై మైనింగ్, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం దృష్టి సారించడంలేదు. చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలించడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి నీరు ఎక్కువగా వచ్చిన సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వానా కాలంలో చెరువులోకి దిగిన మత్స్య రైతులు, యువకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి: గ్రామపంచాయతీకి, ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. దీంతో అటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడటం, మరో వైపు ప్రకృతి సహజ సంపద తరిగిపోతుందని స్థానికులు, రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే దీని పై దృష్టి సారించి చెరువు మట్టి తవ్వకాలు, రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమంగా తవ్వుతున్న మట్టిని పెద్దవంగర శివారులోని ఇటుక బట్టికి అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఈ తతంగం అంతా జరుగుతోంది. దీనికి ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.15 వందల వరకు గుత్తేదారులకు డిమాండ్ ఉంటోంది.

కనుకుంట్ల నరేష్ – ముదిరాజ్ మండల మహాసభ అధ్యక్షుడు
మా గ్రామంలోని ఎర్రగుంట్ల చెరువు నుండి గత మూడు రోజులుగా అక్రమంగా చెరువు మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టికి ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారు. ఈ విషయమై నేను సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మా గ్రామం ప్రకృతి సహజ సంపదను కాపాడాలని, మేము చేపల వేట కోసం చెరువులో దిగినప్పుడు ఆ గోతులలో పడి మా ముదిరాజ్ రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, చెరువు మట్టి అక్రమ రవాణా చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మా పోచంపల్లి గ్రామ ప్రజలు వాపోతున్నారు.

Leave a Reply