అనుమతుల లేమితో నిలిచిపోయిన జెయింట్ వీల్

బెజ్జంకి, ఆంధ్రప్రభ : జాతర సందడి, వెలుగుల మధ్య ఒక విషాద గాథ కళ్లముందు ఆవిష్కృతమైంది. జాతరలో ఆనందం పంచాల్సిన చక్రం మూగబోయి నిలబడిపోవడంతో జాతర ఉత్సాహం కొంత కరువైంది. ప్రజలను అలరించాల్సిన జాయింట్ వీల్ (జెయింట్ వీల్) కదలకుండా నిలిచిపోవడంతో యజమాని జీవనాధారం ఒక్కసారిగా మూగబోయింది. ప్రతి ఏడాది జాతర సమయంలో ఆదాయం ఆశిస్తూ జాయింట్ వీల్‌ను ఏర్పాటు చేసే యజమాని ఈసారి మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. అధికారుల నుండి అనుమతులు లేకపోవడంతో యంత్రాన్ని ప్రారంభించేందుకు వీలు లేకపోయింది. రోజులు గడుస్తున్నా చక్రం ఒక్కసారి కూడా తిరగకపోవడం అతని కుటుంబాన్ని ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది.
“పొట్ట చేత పట్టుకుని వచ్చాం… రోజుల తరబడి ఈ జాయింట్ వీల్ ఏర్పాటు చేసాం… చివరి క్షణంలో అనుమతులు లేకపోవడంతో ఒక్క రూపాయి కూడా ఆదాయం లేక నిచ్చేస్టులయ్యాం ” అని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అతని మాటల్లోని బాధ, కళ్లలోని నీరు అక్కడున్న వారిని కదిలించాయి. జాతరకు వచ్చిన ప్రజలు ఈ పరిస్థితిని చూసి చలించిపోయారు. ఒకవైపు వినోదం కోసం వచ్చిన సందడి, మరోవైపు జీవనాధారం కోల్పోయిన కుటుంబం — ఈ విరుద్ధ దృశ్యాలు జాతరలో విషాదాన్ని నింపాయి. అధికారులు సమయానికి చర్యలు తీసుకుని అనుమతులు మంజూరు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేదని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
