వ్యూహాత్మక మార్పులు

కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా బుట్టా రేణుక, ఎమ్మిగనూరుకు రాజీవ్ రెడ్డి

కర్నూలు బ్యూరో, నవంబర్ 1, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆ ప్రభుత్వ హయాంలో స్థాపించబడిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత కూట‌మి ప్రభుత్వం పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటీకరించే ప్రయత్నంపై ఆ పార్టీ ఆధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం..
గతంలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్త కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి, రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు భవిష్యత్తు చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నివారించేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజల మద్దతును అలవరచుకుని, ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తిప్పేందుకు వైసీపీ ముందుకు సాగుతోంది.

కర్నూలులో వ్యూహాత్మకంగా..
ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్యతిరేకత నేపథ్యంలో, కర్నూలు జిల్లా వైసీపీలో వ్యూహాత్మ‌క‌ మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం, కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుక నియమితులయ్యారు. ఆమె నియామకంతో ఈ నియోజకవర్గంలో పార్టీ శక్తిని పునర్వవ్య‌వ‌స్థీక‌రించాల‌ని జగన్ సంకల్పం స్పష్టమైంది.

ఎమ్మిగనూరు అసెంబ్లీ సమన్వయకర్తగా కడిమెట్ల..
ఇక ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను కడిమెట్ల రాజీవ్ రెడ్డి చేతికి అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మనవడు అయిన రాజీవ్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉందని, పార్టీ పునర్నిర్మాణ యత్నాల్లో ఇది ప్రయోజనకరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

2014లో విజయ రథం – 2024లో పునర్వ‌వ్య‌వ‌స్థీకరణ..
2014 లో కర్నూలు లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున పోటీ చేసి, 44 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించిన బుట్టా రేణుక, అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నఆమెకు ఇప్పుడు వైసీపీలో మరోసారి ప్రాధాన్యం రావడం విశ్లేషకుల దృష్టి ఆకర్షిస్తోంది. దీన్ని జిల్లాలో పార్టీ బలం మరింత పెంచే వ్యూహాత్మక కదలికగా చెబుతున్నారు.

నిరసనలతో నూతన దశకు..
మొత్తం మీద రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై నిరసనలతో పాటు, ప్రాంతాలవారీగా సంస్థాగత బలోపేతానికి కృషి చేయడం ద్వారా భవిష్యత్తు ఎన్నికల దిశలో పునవ్య‌వ‌స్థీకరణకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. కెరటం కదిలించేందుకు వ్యూహాత్మకంగా మైదానంలోకి దూసుకొస్తున్న జగన్ సేన, పీపీపీ పథకంపై ప్రతిపక్ష పాత్రను పటిష్ఠం చేస్తూ తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

Leave a Reply