ఇక బీసీ రిజర్వేషన్లు ఎలా..?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణాలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రజా ప్రభుత్వంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడిని కదిలించినా.. ఈ అంశంపై స్పష్టత కనిపించడం లేదు. తజా పరిణామాలు, పరిస్థితులను పరిశీలిస్తే, ఇక బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అసలు ‘కామారెడ్డి డిక్లరేషన్‌’ సాధ్యమేనా..? అనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజ్యాంగ సవరణతో ముడిపెట్టుకుని ఉన్న వ్యవహారం కావడంతో.. ఏ కోణంలో చూసినా మార్గంతోచడం లేదు. బీసీల‌కు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న దృడసంకల్పంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మూదు కోణాల్లో కసరత్తు పూర్తి చేసింది. అయితే, అందులో ఏ ఒక్కటీ ముందుకు కదలని పరీస్థితి నెలకొంది.

మొదటి దశలో అసెంబ్లిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై బిల్లు పాస్‌ చేసి రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ బిల్లు గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి వెళ్లి గత కొంత కాలంగా ప్రతిష్టంభన నెలకొంది. రెండో దశలో ప్రభుత్వం ఇదే అంశంపై ఆర్డినెన్స్‌ విడుదల చేసింది. అనంతరం రాజ్‌భవన్‌కు పంపిస్తే, గవర్నర్‌ న్యాయ సలహా కోరడంతో మళ్లి ప్రతిష్టంభన నెలకొంది. ఇక మూడో దశలో రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్‌ 9 విడుదల చేసింది. ఇందుకు సంబంధించి హైకోర్టులో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు పిటీషన్లు దాఖలు కావడంతో విచారణ జరుగుతోంది.

ఈ క్రమంలో దాదాపు ఏడాదిన్నర కాలంగా రకరకాల ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహానికి మార్గం సుగమమైనప్పటికీ.. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వ కసరత్తు ముందుకు ప్రాథమిక స్థాయిని దాటి ముందుకు కదలడం లేదు. ఎన్నిక కోణాల్లో ప్రయత్నాలు చేసినా.. ఆ ప్రక్రియ ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది.

జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా పైచేయి సాధించినప్పటికీ రాజ్యాంగపరమైన అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది. అదే సమయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.

దేశంలోనే తొలిసారిగా హడావుడిగా కుల గణన ప్రక్రియను పూర్తిచేసిన ప్రజా ప్రభుత్వం.. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ కులాల వాటాగా జనాభా ప్రాతిపదికన 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అసెంబ్లి వేదికగా ప్రకటించి అయోమయంలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆ రిజర్వేషన్లను అమల్లోకి తీసుకువస్తామని అసెంబ్లిలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపిన తర్వాత టీపీసీసీలో అంతర్మధనం మొదలైంది.

పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఈ అంశంపై సీఎం రేవంత్‌ ఎలా ప్రకటన చేశారన్న చర్చ రాజకీయంగా జోరందుకుంది. ప్రధాని నరేంద్రమోడీ కల్పించుకుని చట్టసవరణ చేస్తే తప్ప.. 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలు రాష్ట్రాలకు సాధ్యం కాదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు సైతం ఈ చిక్కుముడిని ఎలా పరిష్కరిస్తారని, మెజారిటీ వర్గమైన బీసీలకు ఏం సమాధానం చెబుతారని సొంతపార్టీ నేతలే ముఖ్యమంత్రిని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

దీంతో ఓ వైపు ఎమ్మెల్యేలకు, మరోవైపు పార్టీ ముఖ్య నేతలకు ప్రభుత్వాధినేతగా సీఎం రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తికమకపడుతున్న సమయంలోనే మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం జాతీయ స్థాయిలో కుల గణన ప్రక్రియను పూర్తిచేయడానికి ఎంతలేదన్నా.. ఏడాది సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ సమయం తెలంగాణాలో ప్రజా ప్రభుత్వానికి కలిసివస్తోందని రాజకీయ రంగ నిపుణులు అంటున్నారు. రిజర్వేషన్లు తేలితే తప్ప.. తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లలేని స్థితిలో ఉన్న రేవంత్‌ ప్రభుత్వానికి ఊహించని విధంగా వాతావరణం కలిసివచ్చినట్లయింది. ఇప్పటికే గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం పూర్తయి ఏడాది కాలం గడిచిపోయింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

ఈ క్రమంలో రాజ్యాంగబద్దంగా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రత్యేక గ్రాంటు నిధులు వేల కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. అది ప్రభుత్వ పథకాల అమలుకు తీవ్రమైన ఆటంకంగా, ఆర్థిక సమస్యగా మారింది. సాధ్యమైనంత త్వరలోనే ఈ ఎన్నికలు పూర్తిచేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడింది. అయితే, తాజా పరిణామాలతో జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలే వరకూ ఆగకుండా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితులు ఉన్నాయని టీపీసీసీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఒకవేళ ప్రభేత్వ నిర్ణయానికి అంటే ఇటీవల విడుదల చేసిన జీవోకు, ఖరారు చేసిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టు నిర్ణయం వెలువడితే.. అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ విధానం కూడా సిద్దం చేసుకున్నారు. పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్‌ బీని అమలు చేసేందుకు సర్కారు రెడీగా ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసింది.

అందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు మళ్లీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాలి. అందుకోసం కనీసం పక్షం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూలు విడుదల చేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌ హయంలో జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికల్లో బీసీలకు 23శాతం, ఎస్సీలకు 18శాతం ఎస్టీలకు 9శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా? లేక ఇతర వర్గాలకు తగ్గించి, బీసీలకు ఏమైనా పెంచుతుందా? అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణాలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో విజయవంతమై పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో వ్యూహాన్ని రచించి ఏఐసీసీకి ఇవ్వడంలో విజయం సాధించారు. అదే సమయంలో ముందుగా రాష్ట్ర రాజకీయాల్లో తన వ్యూహాన్ని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.

అందుకు రేవంత్‌ బిగ్‌ స్కెచ్‌ చేశారు. విపక్ష పార్టీల దిమ్మతిరిగేలా రాజకీయ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాలకు గాలంవేసే ప్రయత్నాలు ఫలించేలా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేశారు. అందుకు త్వరలో జరిగే ప్రాదేశిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెల్ళే దిశగా చర్యలు మొదలు పెట్టారు. అదే సమయంలో సీఎం రేవంత్‌ మార్గదర్శకాల మేరకు ప్రాదేశిక ఎన్నకలకు ముందే భారాస ఎమ్మెల్యేలు టార్గెట్‌గా టీపీసీసీ పొలిటికల్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టింది.

గ్రామాల్లో కాగ్రెస్‌ కేడర్‌ను బలోపేతం దిశగా పార్టీ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేస్తోంది. ఆ దిశగా తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ ఇటీవలే మార్గనిర్ధేశం కూడా చేశారు. ఈ అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వందలాది మంది రాజకీయ, కుల, ప్రజా సంఘాల నేతలతో మేథోమదనం నిర్వహించి కొత్త కోణంలో మార్గనిర్ధేశం చేశారు. దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌ కాబోతోందంటూ పార్టీ నేతల్లో ఉత్తేజం నింపారు. ఈ వ్యూహం దేశమంతటికీ వర్తించేలా అటు ఏఐసీసీలోనూ వ్యూహరచన జరుగుతోంది.

Leave a Reply